ఎస్ 400, బరాక్ , ఆకాశ్ క్షిపణుల కీలక పాత్ర
న్యూఢిల్లీ : పాకిస్థానీ దాడుల వ్యవస్థను భారత సైన్యం ఏళ్ల తరబడి సంతరించుకుని ఉన్న ధీటైన ఆయుధ వ్యవస్థతో ఛిన్నాభిన్నం చేసింది. రష్యా నిర్మిత ఎస్ 400, బరాక్, 8, ఆకాశ్ క్షిపణులను , సంబంధిత వ్యవస్థను భారతీయ సేనలు తమ ఎదురుదాడులకు వాడాయి. చాప కింద నీరుగా పాకిస్థాన్ చైనా ఇతర దేశాల నుంచి సంతరించుకున్న పలు శ్రేణుల ఎఫ్ 16 ఫైటర్లు డ్రోన్ల వ్యవస్థను లక్షాలు చేరనివ్వకుండా మధ్యలోనే నిలిపివేసి, దెబ్బతీసేందుకు భారత్ అత్యంత కీలకమైన ఆయుధ వ్యవస్థలను రంగంలోకి దింపింది.
శత్రుదేశం పాకిస్థాన్ దూకుడు తీరును బట్టి ఇప్పుడు ఎస్ ఆయుధ వ్యవస్థను ఇతర క్షిపణులను వాడారు. తరువాతి క్రమంలో పరిస్థితిని బట్టి మరింత ఆయుధ పాటవం రంగంలోకి దిగుతుందని సైనిక వర్గాలు తెలిపాయి. భారతదేశంలో అత్యంత కీలక ప్రాంతాలలో నెలకొని ఉన్న వివిధ స్థాయిల సైనిక స్థావరాలను ఎంచుకుని దాడులకు దిగేందుకు , పెద్ద ఎత్తున నష్టం కల్గించేందుకు పాకిస్థాన్ సమాయత్తం అయింది. దీనిని భారతీయ ఇంటలిజెన్స్ వర్గాలు ముందుగా పసికట్టాయి.ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు ఉన్న బలీయ క్షిపణి వ్యవస్థను దెబ్బతీసేందుకు అవసరం అయిన కీలక ఆయుధ వ్యవస్థలకు పని చెప్పిందని వెల్లడైంది.