దండిగా సెంటిమెంట్ , యాక్షన్ మిళితం
న్యూఢిల్లీ : ఘటనలే చరిత్ర అవుతాయి. కొంచెం కాల్పనికతను జోడించుకుంటే సినిమాగా నిలుస్తుంది ఇటీవలి ఆపరేషన్ సిందూర ఇతివృత్తం ఇప్పుడు బాలీవుడ్ చిత్ర నిర్మాతలు, దర్శకులకు కేంద్రబిందువు అయింది. ఓ భారతీయ మహిళ ఉగ్రదాడితో వితంతువు కావడం , ఆమె కన్నీళ్లు తరువాతి క్రమంలో భారతీయ సైన్యం ప్రతీకార చర్య దీనికి ఆపరేషన్ సిందూర సంకేతం నామం ఖరారు చేయడం జరిగింది. దీనితో ఇప్పుడు ఆపరేషన్ సిందూర్, సిందూర్, రివెంజ్, ఆపరేషన్ పేర్లతో సినిమాలు తీయాలని ఈ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలనే తపన పెరిగింది.
రెండు రోజుల వ్యవధిలో దీనికి సంబంధించి 30కి పైగా దరఖాస్తులు సంబంధిత పేర్ల నమోదు సంస్థలు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ నిర్మాతల మండలి వద్ద ఈ టైటిల్ కోసం పోటాపోటీగా దరఖాస్తుల వెల్లువ తలెత్తింది. కొందరు వేర్వేరు సంస్థల పేరిట ఈ పేరు కోసం తమ దరఖాస్తులు పంపించినట్లు తెలిసింది. ఇంతకు ముందు కార్గిల్, ఉరి , కుంభ్ వంటి టైటిల్స్ కోసం పోటాపోటీ డిమాండ్ ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్ ఇతివృత్తంతో చిత్ర నిర్మాణ సంస్థలు హిందూస్థాన్ కా సిందూర్, మిషన్ ఆపరేషన్ సిందూర్, సిందూర్ , సిందూర్ కా బద్‌లా, పహల్గాం , టెర్రర్ అటాక్ వంటి టైటిల్స్‌కు గిరాకీ పెరిగింది. భారతీయ సెంటిమెంట్, యాక్షన్, కావల్సినంతగా కథనానికి అవకాశం వంటి పలు హంగులు ఉన్న ఆపరేషన్ సిందూర సినిమా తీయాలని , ఇటీవలి కాలంలో కుంటుతున్నహిందీ సినిమాకు సరికొత్త కళ తీసుకురావాలని నిర్మాతలు దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు.