అక్రమ నిల్వచేస్తే శిక్ష తప్పదు
హోల్‌సేల్ వ్యాపారులకు కేంద్రం హెచ్చరిక
దేశంలో అవసరానికి మించి నిల్వలు
అక్రమంగా నిల్వ చేస్తే శిక్ష తప్పదు
హోల్‌సేల్ వ్యాపారులకు కేంద్రం
హెచ్చరిక కేంద్ర వ్యవసాయశాఖ
మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్
సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో డిమాండ్‌కు తగినట్టు ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉన్నాయని, నిత్యావసరాలను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరతను (food grains shortage ) సృష్టించడానికి ప్రయత్నించరాదని ప్రభుత్వం హోల్‌సేల్ వ్యాపారులను హెచ్చరించింది. భారత్ పాకిస్థాన్ మధ్య సంఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందడం కానీ, ఆహార ధాన్యాల కొనుగోలుకు మార్క్‌ట్లకు పరుగులు తీయడం కానీ అక్కరలేదని కేంద్ర ఆహార , వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ సామాజిక మాధ్యమంలో విజ్ఞప్తి చేశారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వ్యాపార సంస్థలు చట్టపరసంస్థలకు సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా నిత్యావసరాలను అక్రమంగా దాచిపెట్టినా, నిల్వచేసినా, నిత్యావసరాల చట్టం కింద శిక్షకు గురవుతారని హెచ్చరించారు.
బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఇవన్నీ మామూలు స్థాయి కన్నా ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం దేశంలో ఆహార ధాన్యాల(food grains shortage ) నిల్వలపైన, రుతుపవనాలతో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధతపై సమీక్షించారు. పాక్‌తో సాగుతున్న సంఘర్షణ కారణంగా సరిహద్దుల్లోని రైతులు విత్తనాలు నాటే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు సూచనలిస్తూ సహకరించాలన్నారు. సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడితే వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానని చెప్పారు.
ఆహార ధాన్యాల సరఫరా పరిస్థితిని వివరిస్తూ వరిధాన్యం సాధారణ నిల్వలు 135 లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం 356.42 లక్షల టన్నుల వరకు ఉన్నాయని, అలాగే గోధుమలు సాధారణ నిల్వ 276 లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం 383.32 లక్షల టన్నుల వరకు ఉన్నాయని వివరించారు. ఇవేకాక 17 లక్షల టన్నుల ఖాద్యతైలాల నిల్వలు ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు చక్కెర మార్కెటింగ్ సీజన్ కాగా, 79 లక్షల టన్నుల చక్కెర నిల్వలతో సీజన్ ప్రారంభమవుతుందని, 262 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి కావచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం దాదాపు 257 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయిందని చెప్పారు.