కోరి తెచ్చుకున్న కాంగ్రెస్‌తో ‘మార్పు’ను చూస్తున్నాం
అన్నివర్గాల ప్రజలు ‘ఫలితం’ అనుభవిస్తున్నారు
సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్దే గెలుపు
‘రాయల’ విగ్రహావిష్కరణలో బిఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/తల్లాడ : గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పి మాయమాటలు విని తెలంగాణ ప్రజలు మో సపోయారని, దీని ఫలితం అన్నివర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రా మారావు అన్నారు. ఖమ్మం జిల్లా, తల్లాడ మండల పరిధిలో మిట్టపల్లి గ్రామంలో డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడుతూ.. రాయల శేషగిరిరావు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ మోసపూరితమైన 420 అబద్ధాలతో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి నేటికీ ఏ ఒక్క పథకం కూడా సక్రమం గా అమలు చేయలేదని మండిపడ్డారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా చేసిందేమీ లేదని, జిల్లాలో వరి పండించి న రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ ముగ్గురు మంత్రులకు కనబడట్లేదని ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క ఎన్నికల్లో బాండ్ పేపర్‌పై రాసి దేవుని గుడిలో పెట్టి ఇచ్చి న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మన సిఎంరేవంత్రెడ్డి ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్లినా ఒక పైసా తీసుకురాలేదని, అప్పు ఎవరూ ఇవ్వట్లేదని చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లా గా తనను చూస్తున్నారని అనటం సిగ్గుమాలిన చ ర్య అని ఎ ద్దేవా చేశారు. పరిపాలన చేతకాకపోతే వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా భారత రాష్ట్ర సమితి పార్టీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. త్వరలో భద్రాచలంలో ఉప ఎన్నిక రావడం ఖాయమని, ఈ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికలలో అన్ని స్థానాల్లో గులాబీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్‌సి తాతారావు, మాజీ ఎంఎల్ఎలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, బానోత్ హరిప్రియ, కొండబాల కోటేశ్వరరావు, మదన్ లాల్, లింగాల కమల్ రాజ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.