శ్రీ విష్ణు హీరోగా ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు రూపొందించిన సినిమా సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా కథః విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. పైగా విజయ్ చాలా సరదా మనిషి. కాకపోతే లవర్ లేకుండా సింగిల్‌గా ఉన్నానని బాధపడుతూ ఉంటాడు. ఇక అతనికి ఏకైక ఫ్రెండ్ అరవింద్ (వెన్నెల కిషోర్)కి లవర్ ఉండటంతో, వాళ్లెప్పుడు విడిపోతారా అని విజయ్ ఎదురుచూస్తుంటాడు. ఈ మధ్యలో విజయ్ ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించడానికి ప్రయత్నించినా వర్కవుట్ అవ్వదు. ఈ క్రమంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పూర్వ (కేతికాశర్మ) ని విజయ్ ఇష్టపడతాడు. కానీ, పూర్వకి విజయ్ అంటే ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతుంది. మరోవైపు హరిణి (ఇవానా) విజయ్ ని ప్రేమిస్తున్నానని చెప్పి వెంట పడుతూ ఉంటుంది. కానీ, విజయ్ కి హరిణి అంటే ఇష్టం ఉండదు. ఎందుకు హరిణి అంటే విజయ్ కి ఇష్టం లేదు?, ఆమె ఎందుకు విజయ్ ని ప్రేమిస్తున్నానని వెంటపడుతుంది?, అలాగే పూర్వ ఎందుకు విజయ్‌ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడింది?, చివరకు ఈ ముగ్గురి మధ్య కథ ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః ఈ సినిమాలో చెప్పుకోవడానికి బలమైన కథంటూ ఏమీ ఉండదు. దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. ప్రధానంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ మెల్లిగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే ఫస్ట్ హాఫ్‌లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. పైగా ఎక్కువగా కామెడీ సన్నివేశాల కోసం కథనాన్ని సాగదీయడం బాగాలేదు. హీరోయిన్స్ కేతిక శర్మ, ఇవానా పాత్రలను ఇంకా బాగా బలంగా రాసుకోవాల్సింది. ఇక సినిమాలో ఒక పాట కూడా గుర్తుండిపోయేలా లేదు.
మొత్తానికి మ్యూజిక్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో బలమైన కథాకథనాలు ఉండి ఉంటే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేది. అయితే హీరో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ తమ నటనతో పర్వాలేదనిపించారు. అయితే కేతిక శర్మ, ఇవానా నటన గురించి పెద్దంత చెప్పకోవడానికి ఏమీ లేదు. బ్యాంక్ మేనేజర్ గా నటించిన వీటీవీ గణేశ్ మీద చిత్రీకరించిన సన్నివేశాలు పరమ రొటీన్‌గా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, కల్పలత, ప్రభాస్ శ్రీను, కిర్రాక్ సీత, శత్రు ఇందులో ఇతర పాత్రలను పోషించారు. క్లైమాక్స్‌లో నార్నే నితిన్, రెబ్బా మోనికా జాన్, మానసా చౌదరి, మాస్టర్ రేవంత్ (బుల్లి రాజు) అతిథి పాత్రల్లో కనిపించారు. చివరగా కథే లేకుండా కామెడీతో నెట్టుకొచ్చేయాలని దర్శకుడు కార్తీక్ రాజు చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు.