Saturday, May 10, 2025

సిపాయిలు సింహాలై గర్జించిన రోజు

- Advertisement -
- Advertisement -

దుర్మార్గపు పాలకుల మోసాలు, నిరంకుశ దౌర్జన్యాలు, కుట్రపూరిత పన్నాగాలపై విసిగి వేసారిపోయిన ప్రజల గుండెల్లో విప్లవ జ్వాల రగిలింది! నరాలలో ప్రళయ రుధిరం ఉప్పొంగింది! బానిస సంకెళ్లను తెంచివేయడానికి, స్వేచ్ఛా భారతావనిని ఆవిష్కరించడానికి సింహాల్లా గర్జించడానికి ఎదురు చూస్తున్న ప్రజల ఆరాటమే ఈ పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ పిలుపే 1857 మే 10న భగ్గుమన్న సిపాయుల తిరుగుబాటు! ఇది కేవలం తిరుగుబాటు కాదు! భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర సమర శంఖారావం ! 1857 రాకమునుపే వలస పాలకులు ప్రజల ఆర్తనాదాలు, సమస్యలు పట్టించుకోకుండా కేవలం భారత సంపదను దోచుకోవడానికి కంకణం కట్టుకున్నారు. కంపెనీ స్థానిక ప్రజల జీవనాధారమైన కులవృత్తులను తుంగలో తొక్కారు. మన ఎగుమతులపై పిడుగులాంటి పన్నులు, వారి దిగుమతులపై నామమాత్రపు పన్నులు విధించి దేశఆర్థిక వ్యవస్థను ఛిద్రంచేశారు. వారి దుర్మార్గపు ఆర్థిక దోపిడీ, వివక్షాపూరిత పాలన, నూతన భూస్వామ్య విధానాలు ప్రజలకు నరకం చూపించాయి. వారి దుర్నీతి సామాజిక విధానాలు కూడా విప్లవానికి ఊపిరి పోశాయి.

పాశ్చాత్య విద్య, సంస్కృతిని బలవంతంగా రుద్దే ప్రయత్నం ప్రజలలో తీవ్రమైన పరాయీకరణ భావనను కలిగించింది. సాంస్కృతిక విధ్వంసం సృష్టించారు. మత మార్పిడులను ప్రోత్సహించారు. విదేశీ యుద్ధాల్లో భారతీయ సైనికులను బలిపశువులుగా వాడుకున్నారు. వేతనాలలో అమానవీయమైన తారతమ్యం చూపారు. భారతీయ సైనికులకు కనీసం పెన్షన్ కూడా లేదు. తమ హక్కులన్నీ కాలరాస్తున్నారన్న భావన పెరిగి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయారు. అన్నింటా భారతీయుల కంటే యూరోపియన్లకే పట్టంకట్టారు. భూస్వామ్య దళారీలకు ఊడిగం చేస్తూ సామాన్య రైతుల ప్రయోజనాలను, హక్కులను కాలితోతన్నారు. రైతులను, వారి భూముల నుండి తరిమికొట్టారు. దీంతో ప్రజలు తమ భూమిని, వనరులపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాలని ఉగ్రంగా పోరాడటానికి సిద్ధమయ్యారు.

గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ రాబందులను నియమించి, దళారులు, వడ్డీ వ్యాపారులను పెంచి పోషించి, గిరిజన భూములను ఆక్రమించి, స్వదేశీ పరిశ్రమలను నేలమట్టం చేసి, పన్నుల భారం మోపి భూస్వాములకు, దళారులకే లాభం చేకూర్చే ఈస్టిండియా కంపెనీ దుర్మార్గపు పాలనను సహించలేక పాలనకు వ్యతిరేకంగా రైతులు, శ్రామికులు, గిరిజనులు, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా తమను తాము కాపాడుకోవడానికి సాయుధ తిరుగుబాటుకు దిగారు.సన్యాసి తిరుగుబాటు, వెల్లూరు తిరుగుబాటు, పైకా తిరుగుబాటు వంటివి ఆ పోరాట స్ఫూర్తికి ప్రతీకలు. ఈ ప్రతిఘటన ఉద్యమాలలో వేర్వేరు ఆవేదనలు ఉన్నప్పటికీ వారందరిదీ ఒకే లక్ష్యం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి సమాధి కట్టడం! కంపెనీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వారిని మరింతగా ప్రేరేపించాయి. కానీ 1857 లో జరిగిన తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో ఒక ప్రత్యేక అధ్యాయం.

అది తాత్కాలికంగా విఫలమైనా స్వాతంత్య్ర పోరాటానికి తిరుగులేని పునాదులు వేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది -అదే మొదటి స్వాతంత్య్ర సంగ్రామం లేదా సిపాయిల విప్లవం! ఈ విప్లవం భూస్వామ్య స్వభావానికి భయపడి ప్రేక్షక పాత్ర పోషించారు. బ్రిటిష్ కంపెనీ సైన్యం ఉపయోగించిన ఆధునిక మారణాయుధాల ముందు మన సిపాయిల సంప్రదాయ ఆయుధాలు ఏ మాత్రం నిలువలేకపోయాయి.చక్రవర్తిగా ప్రకటించిన బహుదూర్ షా పోరాడే శక్తి లేని వృద్ధుడు కావడం కూడా ఒక కారణం. అనేక కారణాల వల్ల ఈ విప్లవం 1858 మధ్యలో దారుణంగా అణచివేయబడింది. ఈ విప్లవం భారత చరిత్రలో ఒక పెను తుఫానును సృష్టించింది. బ్రిటిషు దుర్మార్గులు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి విక్టోరియా రాణి పాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి వైస్రాయిని నియమించారు. ఈ విధంగా భారతదేశం బ్రిటిషు సామ్రాజ్యవాదంలోకి కూరుకుపోయింది. కానీ, ఈ విప్లవం రగిలించిన స్వాతంత్య్ర కాంక్ష ఎందరో యోధులకు స్ఫూర్తినిచ్చింది. వారి పోరాట ఫలితంగానే 1947 ఆగస్ట్ 15న మనకు స్వేచ్ఛ లభించింది. ఆనాటి విప్లవకారుల త్యాగం ఎప్పటికీ మరువలేనిది!

  • కింజరాపు అమరావతి, 82472 86357 ( నేడు సిపాయిల తిరుగుబాటు దినోత్సవం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News