‘పురుషుల విద్య, ఇతర నైపుణ్యాలను మహిళలకు కూడా అందిస్తే మన సమాజం త్వరితగతిన ప్రగతిని సాధిస్తుంది. ఏ దేశ పురోగతని లెక్కించాలంటే ముందుగా మహిళల అభివృద్ధితో పోల్చి చూడాలి’ అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ఇటీవల రుజువయ్యాయి. పాకిస్థాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణ, దాడుల్లో ప్రధాన నాయకత్వం వహించింది మహిళలన్న విషయం మనం చూశాం. సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఇది మహిళల సాధికారతకు నిదర్శనం. తాము ఎందులోనూ తక్కువ కాదని, సమానం మాత్రమే కాదని, అంతకన్న ఎక్కువని నిరూపించారు. సోఫియా ఖురేషి దేశంలోనే కాదు, ప్రపంచంలో ముఖ్యమైన సందర్భాల్లో భాగస్వామ్యం పొందారు. 2006లో కాంగోలో ఐక్యరాజ్య సమితి తరపున పీస్ కీపింగ్ మిషన్‌కు భారతదేశం తరపున నాయకత్వం వహించారు. వ్యోమిక సింగ్ చాలా సమయాల్లో వైమానిక దళంలో కీలక పాత్ర పోషించారు. ఇది మనం కళ్లారా చూసిన సంఘటనలు. వాళ్లిద్దరిని చూసి దేశం గర్విస్తున్నది. దేశంలో సగభాగం ఉన్న మహిళలు భూమి మీద, ఆకాశంలో సగమని ఇద్దరు సైనికాధికారులు మనకు రుజువు చేశారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. గత కొన్ని సంవత్సరాల వరకు సైన్యంలో మహిళలకు అంతగా ప్రాధాన్యం లేదు. అయితే చాలా సంవత్సరాల పోరాటం తర్వాత ప్రస్తుతం అన్ని విభాగాల్లోకి మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇది కేవలం వారి ప్రతిభ ఆధారంగానే జరుగుతున్నది. భారత దేశంలో భవిష్యత్‌లో మహిళ శక్తిని అన్ని రంగాల్లో ప్రధానంగా చూడబోతోందనడానికి ఇది సాక్షం. గతంలో మహిళలకు, బాలికలకు ఎన్నో ఆంక్షలుండేవి. అయితే ఇన్ని పదుల సంవత్సరాల పోరాటం మహిళలను తల ఎత్తుకొని నిలబడేటట్టు చేసింది. మహిళా లోకం తల ఎత్తుకొని వాళ్లు నిలబడటం కాదు పురుషులు మహిళలను చూడాలంటే సమాన స్థాయిలో చూడటం కాదు, పురుషులు తల ఎత్తుకొని, వాళ్ల ఎదుగుదలను వీక్షించాల్సి వస్తుంది. ఇది శుభ పరిణామం. అంతేకాకుండా, విద్యా రంగంలో అమ్మాయిలు చూపిస్తున్న ప్రతిభ ఆశ్చర్యానందాలను కలిగిస్తున్నది. అది మెడిసిన్ కావచ్చు, ఇంజినీరింగ్ విద్య కావచ్చు. అన్నింట్లో బాలకలు, మహిళలు బాలురతో, పురుషులతో సమానం కాదు, కొన్ని సార్లు బాలికలదే హవా అంటూ దినపత్రికల్లో పతాక శీర్షికలు చదువుతున్నాం.
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల్లో మహిళలు ప్రదర్శిస్తున్న ప్రతిభ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నది. యుపిఎస్‌సి పరీక్షలు చాలా కష్టతరమైన పరీక్షగా ఉన్న విషయం అందరికీ తెలుసు. 1951లో మొదటిసారిగా యుపిఎస్‌సి పరీక్షల్లో ఒక మహిళ విజయం సాధించింది. 1927లో కేరళలోని ట్రావెన్‌కోర్ సంస్థానంలోని పతనంతిట్టలో జన్మించిన ఆమె పేరు అన్నరాజం. మద్రాసు రాష్ట్రంలోని చెన్నైలో ఎం.ఎ ఇంగ్లీషు చదివి, యుపిఎస్‌సి పరీక్ష రాసి విజయం సాధించింది. రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వూకు హాజరైంది. అయితే అప్పటి యుపిఎస్‌సి చైర్మన్ ఆర్‌ఎన్ బెనర్జీ నాయకత్వంలోని నిపుణుల బృందం అన్నరాజంను ఇంటర్వూ చేసింది. ఆమె ఇంటర్వూలో ఎంపికైన తర్వాత కూడా యుపిఎస్‌సి ఆమెకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) ఇవ్వడానికి నిరాకరించింది. దానికి బదులు ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) తీసుకోవాలని సూచించింది.
అయితే అన్నరాజం ఆ సూచనను తిరస్కరించింది. దానితో వారికి అన్నరాజంకు ఐఎఎస్ ఇవ్వడం అనివార్యమైంది. ఆ తర్వాత ఆమె ముందుగా మద్రాసు రాష్ట్రంలో, ఆ తర్వాత ఢిల్లీలో చాలా కీలకమైన పదవులు పొంది దేశంలోనే మొదటి మహిళా ఐఎఎస్ అధికారిగా చరిత్ర సృష్టించింది. ఇది గతం అడ్డంకులు, అవరోధాలు, వివక్షలు, విమర్శలు అన్ని ఎదుర్కొని మహిళలు ఈ రోజు ఐఎఎస్ రంగం లో అద్వితీయమైన పురోగతిని సాధించారు.మహిళలు ఐఎఎస్ అధికారులుగా పనికి రారని 1951లో అన్నరాజంను అవమానపరిస్తే ఈ రోజు ఉప్పెన లాగా మహిళలు ఐఎఎస్ రంగాన్ని మహిళలదే అన్నట్టుగా విజయం సాధిస్తున్నారు. ఇందులో మహిళలకు రిజర్వేషన్ లేదు. పురుషులతో పోటీ పడాల్సిందే. గత పది సంవత్సరాల్లో ఐఎఎస్ రంగంలో మహిళలు సాధించిన ప్రగతి చూస్తే మన కళ్లను మనమే నమ్మలేం. 2018లో 24 శాతం మంది మహిళలు ఐఎఎస్‌లో ఎంపికైతే 2023 కు వచ్చేసరికి 34 శాతం వరకు ఎదిగారు.
అయితే 2024 తుది పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22, 2025న ప్రకటించారు. అందులో మహిళలు 41 శాతం స్థానాలను సాధించారు.అంటే అయిదారు సంవత్సరాల్లో దాదాపు 17 శాతం ఎక్కువగా ఉద్యోగాలను సాధించుకున్నారు. అంతేకాకుండా గత నాలుగైదు సంవత్సరాలుగా చాలా సార్లు మొదటి రెండు స్థానాలను సాధించి, పురుషుల ఏకఛత్రాధిపత్యాన్ని దెబ్బకొట్టారు. 2024 సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో మొదటి, రెండవ స్థానాలను సాధించడం మాత్రమే కాదు, మొదటి 25 మందిలో పదకొండు మంది మహిళలే. 2023 సంవత్సరంలో మొదటి ఐదు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే. ఇందులో మూడవ ర్యాంకు సాధించింది మన తెలంగాణ పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కావడం మనందరికీ తెలుసు. 2022 సంవత్సరంలో 25 మందిలో 14 మంది మహిళలు ర్యాంకులను సాధించుకున్నారు. ఇంకొక విషయం చెప్పుకోవాలి. మహిళల చైతన్యం, నిరంతర పోరాటాలు మరో విజయాన్ని సాధించిపెట్టాయి. వరకట్నం మహిళలకు, ముఖ్యంగా నూతన వధువులకు పెను శాపంగా ఉన్నది. ఇప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉన్నది.
అయితే గృహ హింస చట్టం వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్నదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇది మహిళలకు, ముఖ్యంగా ఎటువంటి శక్తిలేని వారికి ఇది ఒక రక్షణ కవచమైంది. అందువల్ల 2010లో 8391 వరకట్నం హత్యలు జరగగా, 2024 నాటికి అవి 6 వేలకు పడిపోయాయి.సైన్యంలో మహిళల వీరోచిత పాత్ర కాని, అత్యున్నత అధికార యంత్రాంగం ఐఎఎస్‌లలో అద్భుతమైన ప్రతిభ కాని, వరకట్నం హత్యలను ఎదిరించి పోరాడిన తెగువ కాని మహిళల పురోగతికి అద్దం పడుతున్నాయి. ఇందుకు గల కారణాలు, భారత రాజ్యాంగం అందించిన హక్కులు, దానితో నిర్మాణమైన చట్టాలు, విద్యా రంగంలో వాళ్లు చేస్తున్న కృషి, ఉద్యోగాల్లో వాళ్లు ప్రదర్శిస్తున్న చొరవ అన్ని కూడా ఈ ఎదుగుదలకు కారణాలే. దానితో పాటు పదుల సంవత్సరాల నుంచి ఎంతో మంది మహిళా నాయకులు, సంస్థలు సాగించిన నిరంతర సంఘర్షణ కూడా ఒక ప్రధాన కారణం. ఆడిపిల్ల పుడితే బెంబేలుపడిపోయే తల్లిదండ్రులు తక్కువయ్యారు. ప్రస్తుతం తల్లులైన మహిళలు, యువతులు ఎక్కువ మంది చదువుకున్నవారే. మగవాళ్లు తమ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తే తల వంచుకొని బాధపడే తరం కాదు. ఇది విద్య, ఉద్యమాల వల్లనే సాధ్యమైంది. ఒకప్పుడు ఆడపిల్ల అంటేనే ఆమడ దూరం పరుగెత్తే కుటుంబాలు తగ్గిపోయాయి.
ఇదంతా ఒక పరిణామాన్ని సూచిస్తున్నది. గత వేల సంవత్సరాలుగా విద్య, జ్ఞానానికి దూరంగా వున్న మహిళలు ఈ రోజు వాటిని తమ ప్రతిభతో సొంతం చేసుకుంటున్నారు. మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు. గతంలో కొడుకులు లేకుండా తమను పున్నామ నరకాల నుండి ఎవరు బయటపడేస్తారనే మూఢత్వం కొద్దిగానైనా నశించింది. నిజానికి చాలా సందర్భాల్లో కొడుకుల కన్న కూతుర్లే నయమని నిరూపించే ఘటనలు ఎన్నో ఉన్నాయి. నిజానికి కూతుకు లేకుంటే బాధపడే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువైంది. గత కొన్ని ఏళ్ల కిందట ఆడవాళ్లే పుట్టవద్దని మొక్కుకునేవారు. ఇప్పుడు ఒక్క ఆడపిల్ల అయినా కావాలని కోరుకుంటున్నారు. అందుకే వర్తమానంలో 2020 దశకంలో ఈ లోకానికి వస్తున్న ఆడ శిశువులు గతంలో లాగా వివక్షను ఎదుర్కొనే అవకాశాలు తక్కువ. గతంలో వద్దనుకున్నాం. కానీ ఇప్పుడు ఎంతో సంతోషంతో ఆహ్వానిస్తున్నాం. ఎందరో మహానుభావుల దార్శనికత, మరెందరో మహిళా నాయకుల త్యాగాలు నేటి ఆడపిల్లలకు రాచబాటలు వేస్తున్నాయి. అందుకే ఈ లోకానికి వస్తున్న నూతన ఆడ శిశువులకు ఆహ్వానం పలుకుదాం. భవిష్యత్ ఇక ఎంత మాత్రం పురుషులది కాదు. ఏకఛత్రాధిపత్యం అసలు కాదు. భవిష్యత్ మహిళలదే.
-మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)