న్యూఢిల్లీ: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి(Terrorism) ప్రతీకారంగా భారత్(India) చేపట్టిన అపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్(Pakistan)ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అందరూ యుద్ధం అనివార్యమని భావించారు. కానీ, అమెరికా మధ్యవర్తిత్వంతో శనివారం సాయంత్రం 5 గంటల(భారత కాలమానం ప్రకారం) నుంచి ఇరు దేశాలు.. కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఉగ్రవాదంపై భారత్ రాజీ లేని వైఖరి కొనసాగిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్, పాక్ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ అంతం చేస్తుందని స్పష్టం చేశారు.