Sunday, May 11, 2025

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన టాప్ టెర్రరిస్టులు వీళ్లే

- Advertisement -
- Advertisement -

పహల్గా ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది. లష్కరే తయ్యిబా, జైషే ఉగ్రముఠాలే లక్షంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. మే 7 వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత పాక్, పీఒకేలో జరిపిన మెరుపు దాడుల్లో తొమ్మిది కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఇటీవల కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులు హతమైనట్టు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టుగా పేర్కొంటూ ఆంగ్ల మీడియాలో ఓ జాబితా బయటికొచ్చింది.

1.ముదస్కర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ : ఇతడే లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది . ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వం లోని జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ , పంజాబ్ (పాక్) సిఎం, ఐజీ పాల్గొన్నట్టు సమాచారం.
2. హఫీజ్ మహమ్మద్ జమీల్ : జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా లోని కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది.
3. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ సలీమ్ అలియాస్ సాహబ్ : జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది ఇతడు. మసూద్ అజార్ మరో బావమరిది అయిన అజార్.. .ఐసీ 814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
4. ఖలీద్ అలియాస్ అబు అకాస : లష్కరే తయ్యిబాకు చెందిన టాప్ ఉగ్రవాది. జమ్ముకశ్మీర్‌లో పలు ఉగ్రవాదులకు నేతృత్వం వహించాడు. అఫ్గానిస్థాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు. ఫైసలాబాద్‌లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు పాక్ లోని సీనియర్ ఆర్మీ అధికారులు , స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్టు సమాచారం.

5. మహమ్మద్ హసన్ ఖాన్ : జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు . జమ్ముకశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు.
జైషే , లష్కరే ముఠాల కీలక స్థావరాలే లక్షంగా భారత్ ఈ మెరుపుదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో… లాహోర్‌కు 40 కిమీ దూరంలోని మురిడ్కేలో గల లష్కరే తొయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ , డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు. ఇక జైషేకు చెందిన ప్రధాన కేంద్రం బహవల్‌పూర్ లోని మర్కజ్ సుబాన్ పైనా దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబం లోని 10 మంది మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News