హైదరాబాద్: సోషల్‌మీడియాలో(Social Media) లైక్స్, వ్యూస్ పెంచుకొనేందుకు ఎంత పిచ్చి పని చేయడానికైనా.. వెనుకాడటం లేదు కొందరు నెటిజన్లు. లైక్స్, వ్యూస్ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే జరిగాయి. లైక్స్ కోసం సాహసాలు చేయవద్దని చెప్పినా.. కొందరు ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోని ఆర్టిసి ఎండి సజ్జనార్(Sajjanar) ‘ఎక్స్’ పోస్ట్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఓ యువకుడు ట్రైన్ వస్తుండగా.. పట్టాల మధ్యలో పడుకొని ఆ రైలు వెళ్లిపోయాక లేస్తాడు. పైకి లేచి ఏదో ఘన కార్యం సాధించిన వాడిలా కేకలు వస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేసిన సజ్జనార్(Sajjanar) ‘‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం! సోషల్ మీడియాలో(Social Media) వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’’ అంటూ పోస్ట్ చేశారు.