కాలు నరం తెగింది అంటూ ఆసుపత్రికి వెళ్తే తలకు ఆపరేషన్ చేసి ప్రాణాలు తీసిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎరకారం గ్రామం,సూర్యాపేటకు చెందిన కుర్ర పరమేష్ (26) హయత్ నగర్, హైదారాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదిన బహదూర్పల్లిలోని ఒక ఇంట్లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో ఇంటి సామాన్ తరలించేందుకు పనికి వెళ్ళాడు.సామాను షిఫ్ట్ చేస్తున్న క్రమంలో రేకు లాంటి వస్తువు పరమేశ్ కాలికి తగిలి నరం తెగి రక్త స్రావం అవడంతో,గమనించిన తోటి పని వారు దగ్గర్లో ఉన్న బహదూర్పల్లి లోని ఎస్ వి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కి తరలించి చికిత్స అందిచ్చారు.రెండు రోజులు చికిత్స చేసిన ఆసుపత్రి యాజమాన్యం,బాధితుడు కోలుకున్నాడని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.నాలుగు రోజులు గడిచినా పరమేశ్ ను డిశ్చార్జ్ చేయట్లేదని అడగగా… పరమేష్ తలలో రక్తం గడ్డ కట్టింది ఆపరేషన్ చేశామని,అతని పరిస్తితి సీరియస్ గా ఉందంటూ చల్లగా బదులిచ్చారు వైద్యులు.
కాలికి గాయంతో ఆసుపత్రికి వెళ్తే,తల కు ఆపరేషన్ చేయడం ఏంటని అడిగితే సమాధానం దాటవేశారనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.తీరా పరమేశ్ బ్రతికే ఛాన్స్ తక్కువని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు.గాంధీ ఆసుపత్రి వైద్యులు పరమేశ్ మరణించాడని చెప్పడంతో శోక సంద్రంలో మునిగిపోయారు బాధిత కుటుంబం.న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా ప్యాకర్స్ అండ్ మూవెర్స్ వాళ్లపై ఫిర్యాదు ఇవ్వండి,అందులో ఆసుపత్రి వైద్యుల తప్పు లేదంటూ ఉచిత సలహాలు ఇచ్చి నిర్లక్ష్యం చేశారని కన్నీరు మున్నేరయ్యారు బాదితులు. ఆఖరికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడానికి కానిస్టేబులు డబ్బులు డిమాండ్ చేశాడని,4వేల రూపాయలు ఇచ్చెద్దాక కూడా మృతదేహాన్ని తమకు ఇవ్వలేదని కన్నీటి పర్యంతం అయ్యారు బాధితులు.ఎస్ వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో పరమేశ్ చనిపోతే,ఆసుపత్రి పై చర్యలు తీసుకోకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.