Tuesday, May 13, 2025

బుద్ధవనంలో సుందరీమణుల సందడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/హాలియా : మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరాంగులు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సందడి చేశారు. పర్యాటక శాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వీరందరిని నాగార్జునసాగర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ అందగత్తెలకు స్థానిక ప్రభుత్వ అధికారులు సంప్రదాయ రీతిలో జానపద, గిరిజన నృత్య కళాకారులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ప్రపంచ సుందరీమణుల పోటీదారులకు ఘనంగా స్వా గతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్ పి శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. బుద్ధవనం ప్రాంగణాన్ని కలియదిరిగి వారంతా అందమైన దృశ్యాలను ఫోటోలు తీసుకున్నారు. కొన్ని చోట్ల సెల్పీలతో ఎంతో ఆనందంగా గడిపారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు వివరించారు.

జాతక వనంలో బుద్ధ జీవన క్రమాన్ని తెలిపే శిల్పాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తిలకించారు. బుద్ధవనానికి చేరుకున్న కంటెస్టెంట్లలో ఆసియా ఓసియాన గ్రూప్ -4 లోని 22 దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఆసియా ఓసియాన గ్రూప్ -4లోని ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా, మయన్మా ర్, వియత్నం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, జపాన్ , కజకిస్తాన్, కిర్గికిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా దేశాల నుంచి వచ్చిన పోటీదారులు బుద్దవనాన్ని సందర్శించారు. మిస్‌వరల్డ్ పోటీదారులు బౌద్ధ థీమ్ పార్క్‌లోని స్తూపం వద్ద బుద్ధుని విగ్రహాల చెంత జరిగిన ధ్యా నం,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అం తకు ముందు పర్యాటక సంస్థ విజయవ విహార్‌లో కొంతసేపు విశ్రాంతి అనంతరం ఫోటో షూట్‌లో సుందరీమణులు పాల్గొని అందరిని అలరించారు. నాగార్జునసాగర్ బ్యాక్ గ్రౌండ్‌లో స్పెషల్ ఫోటో షూట్‌లో చేపట్టారు.

మహాబోధి, నెలెకుప్పే బౌద్ధ బిక్ష్వువులచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత బుద్ధుని మహా పాదాలకు పూలతో పూజలు, మహా స్థూపంలో జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ధ్యానంలో పాల్గొన్నారు. బుద్ధవనంలో అతిపెద్ద ధ్యాన ఆరామంతో పాటు బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే విగ్రహాలను చూసి అశ్చర్యం వ్యక్తం చేశారు. మహాస్థూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘన స్వాగతం పలకగా, జాతకవనంలో బుద్ధ చరితంపై కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఏఎన్‌సిలు రమేష్, మౌనిక, ఆర్‌డివోలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్‌లో
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
మిస్ వరల్ లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టర్లు మంగళవారం నాడు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. దాదాపు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరిమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మా ర్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కె ఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ నిర్వహిస్తారు.

గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు, అనంతరం సుప్రసిద్ధ చౌహన్లా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసే విందుకు హాజరవుతారు. మిస్ వరల్ కాంటేస్టర్లకు మెహేంది వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అదే విధంగా నిజాం సాంప్రదాయ దుస్తులను కూడా ధరించడానికి ఏర్పాటు చేశారు. దీనితోపాటు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు. చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం హయాంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు తిలకిస్తారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News