తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు (Taraka Rama Rao) ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని న్యూ టాలెంట్ రోర్స్ @ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ద్వారా ప్రతిభావంతులైన కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గ్రాండ్ ముహూర్తం షూట్ సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ లో వైభవంగా జరిగింది.
ప్రారంభోత్సవ వేడుకకు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్ కొట్టారు. దగ్గుబాటి పురందేశ్వరి కెమరా స్విచాన్ చేశారు. లోకేశ్వరి గౌరవ దర్శకత్వం వహించగా, నందమూరి సుహాసిని, నందమూరి మోహన్ రూప, శ్రీమంతిని, నందమూరి వసుందర బాలకృష్ణ, దగ్గుబాటి నివేదిత, నందమూరి దీపిక, చలసాని చాము, నందమూరి జయశ్రీ, నందమూరి లక్ష్మీ హరి కృష్ణ, కంటమెన్ని దీక్షిత స్క్రిప్ట్ ని అందించారు. నందమూరి మోహన్ కృష్ణ డీవోపీ చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ “నందమూరి కుటుంబం నుంచి మరో తరం తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మా నాన్న ఒక కళాతపస్వీ. ఆయన క్రమశిక్షణతో చలనచిత్ర రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారు.
అందుకే ఆయన పేరును భారతీయ సినీ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించారు. మేమంతా రామ్ అని పిలుచుకునే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి కూడా కళామతల్లి ఆశీర్వాదంతో పాటు కుటుంబసభ్యుల ఆశీస్సులూ ఉంటాయి. ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువుతీరి ఉంటాడో అలాగే వైవిఎస్ చౌదరి హృదయంలో నాన్నగారు నందమూరి తారక రామారావు కొలువుతీరి ఉంటారు”అని అన్నారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ “నందమూరి తారక రామారావు… అతని ముత్తాత నందమూరి తారక రామారావు లాగా కీర్తి ప్రతిష్ట ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. నాలుగో తరం ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది”అని తెలిపారు.
హీరో నందమూరి తారక రామారావు మాట్లాడుతూ “మా ముత్తాత నందమూరి తారక రామారావు, మా తాత నందమూరి హరికృష్ణ, మా నాన్న నందమూరి జానకి రామ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నాను. నా కుటుంబసభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది”అని తెలియజేశారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ “తెలుగు జాతి ఉన్నంతవరకూ ఎన్టీఆర్ ఉంటారు. ఆయన కుటుంబంలో నాలుగోతరానికి చెందిన వ్యక్తి.. ఆయన పేరు పెట్టుకున్న మనవడు ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవం ఈ ప్రదేశంలో జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి గీత, హీరోయిన్ వీణ రావు తదితరులు పాల్గొన్నారు.