భావిభారత భవితవ్యాన్ని ఘనంగా ఆవిష్కరించంలో నేటి బాలలకు, విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులు తగిన మార్గ నిర్దేశం చేయాలి. ఎక్కడో జరిగిన అవాంఛనీయ సంఘటనలకు భయపడి, తమ పిల్లలు కూడా అదే బాటపడతారనే భయంతో, పిల్లల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించడం వలన భవిష్యత్తులో జరిగే అనర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. అతి గారాబంతో పిల్లలను పెంచడం మంచిది కాదు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్ధులను చూస్తున్నాం. ఫోన్ కొనివ్వలేదని, ల్యాప టాప్ చూడనివ్వలేదని, బాగా చదువుకోమంటున్నారని, మార్కులు సరిగా రాలేదని, తల్లిదండ్రులు మందలించారని, ప్రిన్స్‌పల్ తిట్టాడని, ఉపాధ్యాయుడు కొట్టాడని ఇలా వేర్వేరు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి గురించి వింటూనే ఉన్నాం.
అడిగినవన్నీ కొనిచ్చి, అతి గారాబం చేయడం వలన, పొగడ్తలకు అలవాటుపడి, ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులు తిట్టినందుకు తీవ్రంగా మనస్తాపం చెంది, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న నేటితరం బాలల, విద్యార్ధుల మానసిక స్థితిని గురించి తల్లిదండ్రులు కూలంకషంగా అధ్యయనం చేయాలి. మంచి పని చేస్తే చిన్న ప్రశంస, చెడ్డ పని చేస్తే మందలించడం అవసరం. దాదాపు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలపై భారం మోపకూడదు. ఆటపాటలతో, మన వ్యవహారశైలితో వారికి ప్రేమాప్యాయతలను చవిచూపించాలి. చిన్నచిన్న కథలద్వారా, పాటలద్వారా వారికి లోకం గురించిన ప్రాథమిక అవగాహన కలిగించాలి. టివిలకు, మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. పుస్తకాలలోని బొమ్మల ద్వారా జ్ఞానం వైపు దృష్టిని మళ్ళించాలి. స్పష్టమైన ఉచ్చారణ అలవాటు చేయాలి. నాట్యం, సంగీతం వైపు ఆసక్తి కలిగేలా చేయాలి.
కేవలం రెండు మూడు సంవత్సరాల వయసులోనే స్కేటింగ్, స్విమ్మింగ్ వంటి వాటి జోలికిపోవద్దు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకు వారి తప్పొప్పులను తెలియ చేసి, సన్మార్గంలో పెట్టడం అవసరం. అలాకాకుండా ఏం చేసినా పొగడుతూ, పెంచడం వలన పిల్లలు మనకు తెలియకుండానే ఒక కంఫర్ట్ అండ్ సెన్సిటివ్ జోన్‌లోకి వెళ్ళి పోతున్నారు. ఎండలోకి వెళ్ళనీయకుండా, వానకు తడవనీయకుండా, దుమ్ము ధూళి సోకనీయకుండా, ముట్టుకుంటే హాండ్ వ్యాష్ చేసుకునే విధంగా పెంచడం వలన పిల్లల్లో రోగనిరోధక శక్తితగ్గిపోతుంది. చేతులు కడుక్కోవాలి. కాని ఖరీదైన హ్యాండ్ వాష్‌తో కాదు. బలమైన ఆహారం పెట్టండి. చికెన్లు, మటన్లు, బిర్యానీలు తింటే బలమొస్తుందనే భ్రమను వీడండి.
రోజూ ఒకే రకమైన తిండి పెట్టకండి. మెనూ మార్చండి. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేటట్లు చూడండి. చిన్నప్పటి నుండే రుచిపచీ లేని ఆహారం పెట్టి పిల్లలను చప్పిడి కూటితో రుచికి దూరం చేయకండి. కెమికల్ ఫుడ్‌కు పిల్లలను దూరం ఉంచాలి. తల్లిదండ్రులకు, బంధువులకు, పెద్దలకు పిల్లలను దగ్గర చేయాలి. అప్పుడప్పుడూ గ్రామీణ వాతావరణాన్ని పిల్లలకు పరిచయం చేయడం. ప్రకృతి అందాలను పిల్లలను ఆస్వాదించనీయండి. పిల్లలకు చిన్నప్పటినుండే మంచి మంచి ప్రదేశాలను చూపించండి. మంచి వాతావరణంలో పెరిగేటట్లు చేయండి. తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటే పిల్లలు కూడా పద్ధతిగా పెరుగుతారు. కుటుంబ వాతావరణం సరిగా లేకపోతే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఆటపాటలతో, చదువు సంధ్యలతో, అందరితో కలివిడిగా ఉండేటట్టు పిల్లలను పెంచండి.
మంచి చదువు, సంస్కారం, ఇతరులకు పెట్టే గుణం, మంచిని పంచే గుణం పిల్లలకు నేర్పండి. కుళ్ళు, కుతంత్రాలు, స్వార్ధపూరిత మైన మనస్తత్వాలను విడనాడి, పిల్లలను సద్గుణాలతో పెంచండి. ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుంది. పిల్లల పెంపకం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలోసాగాలి. పెద్దలను గౌరవించకపోవడం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, మేలుచేసిన వారికి కీడును తలపెట్టడం, కృతజ్ఞత మరచి ప్రవర్తించడం, స్వార్ధం పతాక స్థాయికి చేరడం నేటి సమాజంలో చూస్తున్నాం. పెట్టి తినే సంస్కృతి పోయి, దోచుకుని తినే సంస్కృతి ప్రబలింది. ఇలాంటి లక్షణాలు గల వాతావరణంలో పిల్లలు పెరిగితే వారు భవిష్యత్తులో ఎలా తయారవుతారో వేరే చెప్పనక్కరలేదు. ఆకాశంలో విహరిస్తూ, నేలను తూలనాడడంలో ఔచిత్యం లేదు. నింగినంటే భవనాలకు కూడా నేలే ఆధారమన్న సత్యం విడవరాదు.
మట్టిలో కలిసే శరీరాలకు మేలిమి రంగులు పూసి, మట్టి వాసనను అసహ్యించుకోవడం అత్యంత అసహ్యకరం. నేలవిడిచి సాము చేయడం మూర్ఖత్వం. వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి, మహా వృక్షమైనా దాని వేళ్ళు మట్టిలోనే ఉంటాయన్న నిజం మరిస్తే ప్రమాదం. ఎవరు, ఎంత ఎత్తుకు ఎదిగినా, వారి చూపు భూమిపై కేంద్రీకరించక తప్పదు. ఆకాశం వైపు చూస్తూ నడిస్తే, నేలపై బోర్లాపడక తప్పదు. అప్పుడు కూడా నేలే ఆధారం. దారం లేని గాలి పటం నేలపై పడకతప్పదు. దీనిని బట్టి మనకు విషయం అర్ధం కావాలి. వెలుగు నిచ్చిన దీపాన్ని ఆర్పేసి, ఎక్కించిన నిచ్చెనను కూలదోసి, అవహేళన చేయడం మూర్ఖత్వం. గాలికి వంగిన చిన్న మొక్కను అలాగే వదిలేస్తే ఆ మొక్క పెరిగి వంకర టింకర చెట్టుగా తయారవుతుంది. వంగిన మొక్కను నిటారుగా నిలబెట్టడానికి చిన్నకర్రతో మొక్కను కట్టినట్టు, సద్గుణాలతో, మంచి మాటలతో పిల్లలకు చిన్నతనం నుండి విలువలను నేర్పితే పెద్దయ్యాక రుజుమార్గంలో పయనించే అవకాశమేర్పడుతుంది.
పిల్లలకు నీతికథలను వినిపించండి. మన పెంపకాలు ఎంత పటిష్టంగా ఉన్నా పెరిగి పెద్దయ్యాక మారిపోయేవారు కూడా ఉంటారు. మన ప్రభావం కంటే దుష్టుల ప్రభావం వారిపై అధికంగా ఉండడం, లొంగిపోయే బలహీనమైన మనస్తత్వం కలిగి ఉండడం దీనికి కారణం. వ్యక్తిత్వం బలంగా ఉండాలి. బంధాలను భారంగా భావించకూడదు. మారిపోయే మనస్తత్వాల వలన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. చిన్నప్పటి నుండి మంచిగా పెరిగినా, పెరిగి పెద్దయ్యాక దుర్జనుల సాంగత్యంలో దుర్బోధలకు బానిసలై సద్గుణాలు కోల్పోవడం ఆరోగ్యానిచ్చే ఔషధాన్ని వదిలేసి, మత్తును కలిగించే మాదకద్రవ్యాల వెంటపడడం లాంటిది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా బాల్యంలోనే సద్గుణాలకు, వివేకానికి బలమైన పునాదులు పడాలి. నేల మీద నిలబడడమే కాదు, మాట మీద నిలబడడం కూడా నేర్పాలి.
- సుంకవల్లి సత్తిరాజు
97049 03463