Tuesday, May 13, 2025

రిజర్వేషన్లపై కులగణన ప్రభావం

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో బ్రిటిష్ పాలనా కాలం నుండే జనాభాను లెక్కించడం మొదలైంది. 1881లో మొదలైన జనగణన ప్రతి పదేళ్ళకోసారి లెక్కించడం జరుగుతున్నది. 1931 జనగణన వరకు కులాల వివరాల్ని కూడా సేకరించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లో జరిగిన జనగణన నుండి షెడ్యూల్డు కులాలు, తెగల వారిని మినహాయించి మిగిలిన కులాల వివరాల్ని నమోదు చేయడం లేదు. 2021 లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి వల్ల జరగలేదు. వివిధ రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు, తదనంతరం లోక్‌సభ ఎన్నికలు జరగడంతో జనాభా లెక్కలు వాయిదా పడుతూ వచ్చాయి. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం అనూహ్యంగా జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేయనున్నట్లు ప్రకటించింది. జనాభా లెక్కలు అనే అంశం భారత రాజ్యాంగంలోని కేంద్ర జాబితాలో పేర్కొనబడిన అంశం కాబట్టి కేంద్రమే సమగ్రంగా జనగణన చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భారత దేశమంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఎన్ని ఉన్నా మనమంతా భారతీయులమనే భావన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగే ఎనిమిదో జనగణన ఇది. దీంట్లో కులాలవారీగా వివరాల్ని సేకరించడం ద్వారా దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల్లో ఆయా సామాజిక వర్గాల్లోని కులాల జనాభాతోపాటు వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వారి వాటా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దేశంలో జనాభాను ఒసి, బిసి, ఎస్‌సి, ఎస్‌టి సామాజిక వర్గాలుగా వర్గీకరించారు.

అయితే ఒక్కో కులం, ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో వర్గంలో ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ఆయా కులాల సామాజిక, ఆర్థిక వెనకబాటు ఆధారంగా ఈ విధంగా వర్గీకరించబడ్డాయని చెప్పవచ్చు. ఒక రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం ఒసి జాబితాలో ఉంటే మరో రాష్ట్రంలో బిసి జాబితాలో చేర్చబడింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 1976 వరకు బిసి జాబితాలో ఉన్న కొన్ని కులాల్ని ఎస్‌టి జాబితాలోకి చేర్చడం జరిగింది. ఇప్పటికీ చాలా కులాలు తమను బిసి, ఎస్‌సి, ఎస్‌టిల జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాయి. జనాభా లెక్కలతోపాటు కులాల వారీగా వివరాల్ని సమగ్రంగా సేకరించడం వల్ల దేశవ్యాప్తంగా ఏయే కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనకబాటుకు గురయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగే వీలుంటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేసింది.

తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తామని కూడా చెప్తోంది. దేశవ్యాప్తంగా పౌరులందరికీ విద్య, ఉద్యోగావకాశాలతోపాటు, సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమానత్వాన్ని కల్పించడం రిజర్వేషన్ ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. 2011 జనగణన ప్రకారం దేశంలో ఎస్‌సి సామాజిక వర్గజనాభా 16.6% అయితే వారికి 15% రిజర్వేషన్, ఎస్‌టి జనాభా 8.6% అయితే వారికి 7.5% రిజర్వేషన్ అమలవుతుంది. ఒబిసి జాబితాలో ఉన్న వారికి 27% రిజర్వేషన్ అమలు అవుతుంది. అయితే ఒబిసి జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. పేదరికానికి కులం, వర్గంతో సంబంధం లేదని 2019 లో కేంద్ర ప్రభుత్వం ఒసిల్లోని పేదల కోసం ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాల రిజర్వేషన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇడబ్లుఎస్ చట్టం తీసుకువచ్చి 15(6), 16(6) ఆర్టికల్స్ ప్రకారం 10% రిజర్వేషన్‌ను కల్పించింది. దీంతో దేశంలోని ఒసి, బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల్లో అర్హులైన ప్రతి వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఫలాలు దక్కేందుకు అవకాశం ఏర్పడింది.రిజర్వేషన్ అనే అంశం సమాజంలోని సామాజిక న్యాయం, సమానత్వం, చట్టపరమైన పరిమితుల మీద ఆధార పడి ఉంటుంది.

ఈ అంశం పై భారత సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% పరిమితిని నిర్దేశించింది. తెలంగాణలో కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో బిసిలకు కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% రిజర్వేషన్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కులగణన నిర్వహించి రాష్ట్ర జనాభా 3.70 కోట్లని తెలిపింది. దేశంలో రిజర్వేషన్ పెంపు అంశం తెర మీదకు వచ్చినపుడు అందరికీ తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ విధానం గుర్తుకు వస్తుంది. కానీ అక్కడ ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల న్యాయ సమీక్షకు అతీతంగా మారింది. 2007లో వచ్చిన ఐ.ఆర్ కోయల్హో కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ 9 వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉండరాదని, అవి న్యాయ సమీక్షకు అతీతం కావని పేర్కొంది. రిజర్వేషన్ పెంపు అంశం కేంద్ర పార్లమెంటు అధికార పరిధిలో రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన కూడా నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రభావం రిజర్వేషన్ల పై ఏ విధంగా ఉండబోతుందో అన్నదానికి కాలమే సమాధానం చెప్తుంది.

  • అశోక్ మంద- 99590 46499
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News