ఎపిలోని పల్నాడు జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ లారీ, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం విచారకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.