రోహిత్ బాటలోనే విరాట్
టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ!
షాక్‌లో అభిమానులు, బిసిసిఐ
ముంబై: భారత క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ఒకడైన విరాట్ కోహ్లి (Virat Kohli) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్ నుంచి తప్పు కోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కొన్ని రోజుల క్రితమే కోహ్లి సమకాలీకుడు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తూ టెస్టులకు రిటైర్మెం ట్ ప్రకటించాడు. కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు సీనియర్ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో టీమిండియా సంప్రదాయ క్రికెట్‌లో కాస్త బలహీన పడుతుందనడంలో ఎలాం టి సందేహం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ మధ్యలో టీమిండియా దిగ్గజ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
రోహిత్ టె స్టులకు గుడ్‌బై చెప్పడంతో కోహ్లి కూడా అతని బాటలోనే పయాణించడం ఖాయమని జాతీ య, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తా యి. అవి నిజమని రుజువు చేస్తూ సోమవా రం కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నా డు. కొంతకాలంగా టెస్టుల్లో కోహ్లి అంతం త మాత్రంగానే రాణిస్తున్నాడు. న్యూజిలాం డ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లి టెస్టుల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో కోహ్లి త్వరలోనే టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని అభిమానులు ఓ అంచనాకు వచ్చారు. ఇదే నిజం చేస్తూ కోహ్లి ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
తనదైన ముద్ర..
ఇక మూడు ఫార్మాట్‌లలోనూ విరాట్ కోహ్లి టీమిండియాపై తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో, వన్డేల్లో, టి20 ఫార్మాట్‌లలో అసాధారణ బ్యాటింగ్‌తో భారత్ క్రికెట్‌కు వెన్నుముకగా నిలిచాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో 2020లో సబినా పార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌తో కోహలి టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో జరిగిన సిరీస్‌లలో కూడా తనదైన బ్యాటింగ్‌తో టీమిండియాకు అండగా నిలిచాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా భారత్ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. సారథిగా జట్టును ముందుండి నడిపించాడు. కెరీర్‌లో కోహ్లి 123 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో 46.85 సగటుతో 9230 పరుగులు సాధించాడు.
ఇందులో 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు, మరో 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో కోహ్లి అత్యధిక స్కోరు 254 పరుగులు. కోహ్లి తన కెరీర్‌లో చివరి టెస్టును ఆస్ట్రేలియాతో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి చాలా రోజుల పాటు నంబర్‌వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇక భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122) అతనికంటే ముందు వరుసలో ఉన్నారు. ఇక అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లి రికార్డు స్థాయిలో 82 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 31, వన్డేల్లో 51, టి20లో ఒక శతకాన్ని నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (100) సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాతి స్థానం విరాట్‌దే కావడం విశేషం. కాగా, కోహ్లి ఇప్పటికే అంత్జాతీయ టి20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు.
షాక్‌లో
అభిమానులు..
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయంతో అభిమానుల ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. మరి కొంత కాలం పాటు టెస్టుల్లో కొనసాగే సత్తా కోహ్లికి ఉంది. అయినా అతను అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని భారత క్రికెట్ బోర్డు, అతని మాజీ, ప్రస్తుత సహచరులు, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కోహ్లి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. కోహ్లి, రోహిత్ ఇద్దరు ఒకేసారి టెస్టులకు వీడ్కోలు పలకడంతో దాని ప్రభావం టీమిండియా పడడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.