కరాచీ: భారత్ ఈ నెల 7వ తేదీన ఆపరేషన్ సింధూర్‌ను(Operation Sindoor) చేపట్టి పాకిస్థాన్, పిఒకెలో వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం జరిగింది. కానీ, పాక్ మాత్రం తమకు ఏ స్థాయిలో నష్టం జరిగిందో ఇప్పటివరకూ బయటపెట్టలేదు. తాజాగా పాకిస్థాన్(Pakistan) ఆపరేషన్ సింధూర్‌తో జరిగిన నష్టాన్ని బయటపెట్టింది. ఈ దాడుల్లో తమ సైనికులు 11 మంది ప్రాణాలు కోల్పోయారని 78 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. పాకిస్థాన్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది కూడా మృతి చెందారని.. వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇక ఈ దాడిలో పాక్‌లోని(Pakistan) 40 మంది ప్రాణాలు కోల్పోయారని.. 121 మంది గాయపడ్డారని తెలిపింది. సోమవారం పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ చౌదరీ తమ దేశ ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా్ట్లాడుతూ.. ‘‘భారతతో జరిగిన సైనిక ఘర్షణల్లో మన వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైంది’’ అని వెల్లడించారు.