అడంపూర్: భారత్ మూడు విధానాలకు సిద్ధమైందని.. ఉగ్రదాడి జరిగితే నచ్చిన సమయంలో నచ్చినట్లు భారత్ దాడి చేస్తామని.. ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని వేర్వేరుగా చూడమని ప్రధాని నరేంద్ర మోదీ(Modi) అన్నారు. మంగళవారం అండంపూర్‌లో అపరేషన్ సిందూర్‌లో(Operation Sindoor) పాల్గొన్న భారత సైనికులను ఆయన కలిసి ప్రశంసించారు. అనంతరం ఆయన.. ‘భారత మాతాకీ జై’.. ‘పందేమాతం’ నినాదాలతో ప్రసంగం ప్రారంభించారు. ‘‘మన సైనికులు యుద్ధక్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోంది’’ అని పేర్కొన్నారు.
త్రివిధదళాలు ఎవరి బాధ్యత వారు అద్భుతంగా నిర్వహించారని.. వాయుసేన పాక్‌లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor).. భారత్-పాక్ మధ్య కొత్త ప్రమాణాలు నిర్ధేశించిందని మోదీ(Modi) స్పష్టం చేశారు. ఉగ్రవాదం అంతం చేస్తామంటూ మన సైన్యం శపథం చేసిందని తెలిపారు. మన సైన్యం చూపిన శక్తిసామర్థ్యాలను ఎంత ప్రశంసించినా తక్కువే అని, అది చూసి తన జన్మ ధన్యమైంది వెల్లడించారు.. మన సైన్యం శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ అని.. ఈ వీర భూమి నుంచి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా అని తెలిపారు. మన సైనికుల వల్ల ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతుందని.. ప్రతీ భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలబడ్డాడు, కృతజ్ఞతలు చెబుతున్నాడని స్పష్టం చేశారు.
భారత సైన్యం భారత సరిహద్దుల రక్షణకు ఇనుపగోడలా నిలబడి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిందని ప్రధాని పేర్కొన్నారు. బిఎస్‌ఎఫ్, ఇతర పారామిలిటరీ దళాలు సరిహద్దుల్లో అద్భుత పనితీరు చూపించాయని కొనియాడారు. మన సైనిక స్థావరాలు, ఇతర సైనిక వ్యవస్థల సమీపంలోకి కూడా పాక్ రాలేకపోయిందని.. మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ సమాధానం ఎలా ఉంటుందో పాక్‌కు అర్థమైందని పేర్కొన్నారు.