యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశంలో హరీష్ రావు అబద్దాలు మానుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar reddy ) హితవు పలికారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించిందని మంత్రి తెలిపారు. ప్రతిరోజు అబద్దాలను ప్రచారం చేస్తూ అవే నిజాలుగా ప్రజలను భ్రమింపచేసే ప్రయత్నం మానుకోవాలని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar reddy ) సూచించారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను ధాన్యం కొనుగోలు విషయంలో హరీష్ రావు (Harish rao) తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు 65 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. గతేడాది కంటే 44 శాతం అధికంగా కొనుగోళ్లు జరిపామని, రెండేళ్ల యాసంగి సీజన్‌తో పోల్చి చూస్తే 120 శాతం అధికంగా కొనుగోళ్లు జరిపామని మంత్రి తెలిపారు.
నేటి సాయంత్రానికి కొనుగోలు చేసిన ధాన్యం 43.10 లక్షల మెట్రిక్ టన్నులని ఆయన పేర్కొన్నారు. 2022, -23 తో పోల్చితే కొనుగోలు చేసిన ధాన్యం 23.48 లక్షలని, గతేడాదితో పోల్చి చూస్తే 13.22 లక్షల మెట్రిక్ టన్నులు అధికమని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు 8,245లు కాగా, గతేడాదితో పోల్చి చూస్తే అదనంగా 1,067 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 6.58 లక్షల రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 27.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకాలని, 15.35 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 9999.36 కోట్లు అని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది రూ.6,671 కోట్లు అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖరీఫ్ సీజన్ లో 66.7 లక్షల ఎకరాలు సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని, ప్రస్తుత యాసంగి సీజన్ లో 55 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం వ్యవధిలోనే ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి దిగుబడి అయ్యే మొత్తం కలిపి 280 లక్షల మెట్రిక్ టన్నులని ఆయన తెలిపారు. ధాన్యం దిగుబడిలో ఇదో చారిత్రాత్మకమైన రికార్డు అని ఆయన అభివర్ణించారు. యాసంగిలోనూ సన్నాలకు రూ.500ల బోనస్ చెల్లించామని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు.