కెసిఆర్ ఆదేశాలను తు.చ
తప్పకుండా పాటిస్తా బిఆర్‌ఎస్‌లో
ఎలాంటి విభేదాలు లేవు నేను
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను… పార్టీ
గీత దాటను తప్పుడు ప్రచారాలు
నమ్మొద్దు ధాన్యం రాశులను వదిలి
రేవంత్ అందాల రాసుల చుట్టూ
తిరుగుతున్నారు రైతు భరోసా
ఏడాది పొడుగునా ఇస్తామనడం
సిగ్గుచేటు రైతుల మరణాలు
కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే ధాన్యం
కొనుగోలు కేంద్రాల వద్ద కనీస
వసతులు లేవు : హరీశ్‌రావు ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నాయకత్వ భాధ్యలు కెటిఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు స్ప ష్టం చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా తాను కెసిఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని తెలిపారు. ఈ విషయం తాను ఇప్పటికే చాలా సార్లు చె ప్పాను అని, ఎన్ని సార్లు అడిగిన ఇదే చెబుతాను అని పేర్కొన్నారు. కెసిఆర్ తమ పార్టీ అధ్యక్షుడు అని, ఆయన చెప్పింది తాను తూ.చా. తప్పకుండా పాటిస్తాను అని తెలిపారు. కెసిఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తాను, ఆయన ఆదేశాలను పాటిస్తానని అన్నారు.
తాను కెసిఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని, ఎట్టి పరిస్థితుల్లో కెసిఆర్ గీసిన గీత దాటేది లేదని వెల్లడించారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తాను పార్టీ మారుతానని జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని సూచించారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై తమ పార్టీ నేతలు డిజిపికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మకోవటానికి రైతులు కల్లాల్లో యుద్ధం చే యాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ధాన్యం రాశులను వదిలేసి.. రేవంత్ అం దాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
అందాల పోటీల నిర్వహణపై సిఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉంటున్నారని అన్నారు. వేలాదిమంది పోలీసులను, ప్రభుత్వాధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారని, కానీ దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు.
రైతుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే
పాకిస్తాన్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ.. రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ముఖ్యమంత్రిని అడిగితే ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారని, ఎవ్వడు నమ్మి అప్పు ఇవ్వట్లేదు అంటున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ, రైతుబంధుపై సిఎం ఎందుకు రివ్యూ చేయటం లేదని ప్రశ్నించారు.
తెలంగాణలో రైతుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని, చనిపోయిన రైతులకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయనందుకు తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, ఢిల్లీకి డబ్బులు పంపటంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు. పెట్టుబడి సాయం మెల్లగా.. ఏడాది పొడవునా ఇస్తామని భట్టి చెప్పటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని నిప్పులు చెరిగారు.
దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలపై సిం రేవంత్ సమీక్ష చేయరు అని విమర్శించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండి.. వడదెబ్బతో రైతులు చనిపోతున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలంతా.. కెసిఆర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సన్న వడ్లకు బోనస్ 512 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉందని, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోజుల తరబడి పెండింగ్‌లో ఉందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని హరీష్‌రావు అన్నారు. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పిందని, కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదని చెప్పారు. కొన్న వడ్లకు 4 వేల కోట్లు బకాయి పడిందని మండిపడ్డారు. 48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రగల్బాలు పలికారని విమర్శించారు. పది రోజులైనా కొన్న పంటకు డబ్బులు దిక్కులేదని ఆరోపించారు. బోనస్ ఊసే లేదని, యాసంగి పంటకు 512 కోట్ల రూపాయలు సన్నాలకు బోనస్ చెల్లించాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయలేదని అన్నారు.
ఎన్నికల ముందు కెసిఆర్ 10 వేలు ఇస్తున్నారని, తాము 15 వేల ఇస్తామని చెప్పారని, అది కూడా పంట సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తామన్నారని చెప్పారు. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో తరుగు తియ్యము అని అన్నారని, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జెట్టి రాజు అనే రైతు క్వింటాల్‌కు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాలలో రైతులు ఆందోళన చేస్తున్నారని, తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకం కంటే మిల్లర్లు తక్కువ ధాన్యాన్ని చూపుతూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని అన్నారు.
ఎండలో వేచి చూడడం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో వేచి చూడడం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 13న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో గగులోతు కిషన్ మృతి చెందారని, ఏప్రిల్ 15న జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో జలపతి రెడ్డి, ఏప్రిల్ 21న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు చెర్లపాలెంలో హనుమండ్ల ప్రేమలత, ఏప్రిల్ 22న నెల్లికుదురు మండలం మదనతుర్తిలో బిర్రు వెంకన్న, ఏప్రిల్ 26న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో చింతకింది హనుమయ్య మృతి చెందారని పేర్కొన్నారు. ఇవి సహజ మరణాలు కావు, ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవే హత్యలే అని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ప్రతిపక్షం మీద బురదజల్లబోయి సిఎం ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదు అని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి, రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలని సూచించారు. రైతుల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని హరీష్‌రావు హెచ్చరించారు.