Wednesday, May 14, 2025

సనాతన ధర్మంలో- విమోచన మార్గం బౌద్ధం

- Advertisement -
- Advertisement -

క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలలో బౌద్ధం (Gautam buddha) అత్యంత ప్రాముఖ్యతను కలిగివుంది. ఇది మతం కాదు, జీవన విధానం. ఇంకా చెప్పాలంటే ఇది మానవీయ మత సంస్కరణవాదం అని చెప్పవచ్చు. భారతదేశంలో మానవత్వాన్ని ప్రబోధించి, సమానత్వాన్ని చాటిన బౌద్ధానికి ఆద్యుడు సిద్ధార్థుడుగా పిలవబడుతున్న గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడు క్రీ.పూ. 563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని వద్ద జన్మించాడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి. సిద్ధార్థుడు పుట్టిన తరువాత తల్లి మరణించడంతో సవతి తల్లి ప్రజాపతి గౌతమి చేతుల్లో పెరిగాడు.

అందుకే అతడిని గౌతముడు అంటారు. ఒక రోజు బుద్ధుడు(Gautam buddha) దారిలో ప్రయాణిస్తుండగా ముసలివాడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూసి అంతర్మథనం చెందాడు. అనంతరం అతడికి దేహం అశాశ్వతమని, ప్రాపంచిక సుఖాలను వదిలి తన 29వ ఏట మహాభినిష్క్రమణం చేశాడు. గయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందే వరకు తపస్సు చేశాడు. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తించబడుతుంది. ప్రతి ఏటా ఆ రోజు బౌద్ధులు బుద్ధుని బోధనలు చదవుతారు. వైదిక మతంలోని అణచివేత నుంచి దళిత, పీడిత, అట్టడుగు వర్గాలను విముక్తి చేశాడు. స్త్రీ, పురుషులిద్దరిని సమానంగా చూసాడు. సామ్యవాద విలువలతో సమాజాన్ని విప్లవీకరించాడు. బుద్ధుని ఉపదేశంలో నాలుగు గొప్ప సత్యాలున్నాయి. అవి లోకం దుఃఖమయం, దుఃఖానికి మూలం కోరిక, కోరికను నివారించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు, అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా కోరికలను నివారించవచ్చన్నాడు. అష్టాంగ మార్గంలో సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన సాధన, సరైన స్మృతి, సరైన ధ్యానం వంటి ఎనిమిది శాస్త్రీయ పరిష్కారాలు చూపాడు. వీటిని చక్కగా ఆచరించడం ద్వారా సంపూర్ణ విశ్వమానవుడిగా మారగలం. ఇవి నేటికీ ఆచరణీయమైనవి. మానవ విలువలు కలిగిన బౌద్ధం అశోకుడు వంటి గొప్ప రాజుల ఆదరణకు నోచుకొన్నది.

దీంతో సామాన్య జనులకు దగ్గరైంది. బుద్ధుడు సరళమైన తాత్వికత, ఆచరణాత్మక విధానాలు భారతదేశంలోపాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసాయి. బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది. బౌద్ధం ముఖ్యంగా మతరంగాన్ని విప్లవీకరించింది. అర్థం లేని కర్మకాండలు, మూఢనమ్మకాలు, జంతుబలులతో భ్రష్టుబట్టిన మతాన్ని సంస్కరించి నైతికతను, మానవీయ విలువలను జోడించింది. భారతదేశంలో అనాదిగా పాతుకుపోయిన కులవ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత అనే అనాగరిక శిక్షల నుంచి సమాజానికి విముక్తి కలిగించింది. బౌద్ధం భారతీయ చరిత్ర, సంస్కృతిని కూడా ప్రభావితం చేసింది. సామాన్య ప్రజలకు చేరువయ్యే క్రమంలో పాళీ వంటి ప్రజల భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించింది. బౌద్ధం గొప్ప వాస్తు శిల్పకళలను ప్రోత్సహించింది. బౌద్ధం సామాన్య ప్రజల విశ్వాసాలను ఆచారాలను తనలో కలుపుకుంటూ సాంస్కృతిక సమైక్యతకు దోహదంచేసింది. ఇప్పుడు భారతదేశం బోధిస్తున్న వసుధైక కుటుంబానికి నాంది పలికింది. బౌద్ధం వర్ణవ్యవస్థలోని కాఠిన్యాన్ని తగ్గించి దళిత, పీడిత వర్గాల పరిస్థితి మెరుగయ్యేందుకు దోహదపడింది. అందుకే ఇది సనాతన ధర్మానికి అభిముఖంగా నిలిచిన పురాతన మానవీయ ధర్మం.

నేడు కులతత్వం, మతతత్వం పెరిగిపోతున్న భారతదేశంలో బౌద్ధ జీవన విధానం అనుసరణీయం. మరోవైపు మతం, ప్రాంతం, జాతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి కూడా బుద్ధుని ప్రవచనాలు అవసరం. గౌతమ బుద్ధుడు అనగానే అందరికీ ప్రశాంతమైన ముఖం కళ్ల ముందు కనబడుతుంది. అందుకే మానసిక నిపుణులు సైతం ఇంట్లో గౌతమ బుద్ధుని ఫోటో పెట్టుకోవాలని చెబుతుంటారు. ఇక బుద్ధుడు చెప్పిన ప్రతీ మాట ఇప్పటికీ మన జీవితాలను నడిపించే ఒక పాఠంగా మారింది. ఏ పని చేసినా మనస్సాక్షిగా చేయాలని చెప్పాడు. అప్పుడే వారు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, పనులు గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని బుద్ధుడు ఆనాడే చెప్పాడు. కావున మనుషులపై ఈర్షా, ద్వేషంను వీడాలి. అహంకారం మనిషి పతనానికి కారణమని, అహాన్ని వదిలిన రోజే నిజమైన విజయాన్ని సాధించినట్లనే శాస్త్రీయతను బుద్ధుడు బోధించాడు.

జీవితంలో మార్పు సహజమనే నిజాన్ని గుర్తించినప్పుడు దుఃఖం అనే మాటకు చోటే ఉండదన్నాడు. ఈ అంతః సూత్రం తెలియక కోట్లాది ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారు. అంగీకరించడం, వదిలిపెట్టడం అనే వాటిని అలవాటుగా మార్చుకొన్నప్పుడే ముందుకు పోతామని బుద్ధునీ సూక్తులు చెబుతున్నాయి. ఆయన బోధనల్లో మరో ప్రధానమైన అంశం అందరి పట్ల సానుభూతి, దయ కలిగి ఉండడం. ఇలాంటి వారు ఎదుటి వారిని ఇబ్బందిపెట్టరు, తమను తాము ఇబ్బందులకు గురి చేసుకోరు. తమ విముక్తికి ధర్మబద్ధ పొరటం చేయాలనీ పిలుపునిచ్చాడు.

భౌతిక సుఖాలపై వ్యామోహాలను వీడిన రోజే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందనే తాత్వికతను బుద్ధుడు తెలిపాడు. ఇలా ప్రకృతిలోని సైన్స్‌ను చాలా చక్కగా చెప్పాడు. బుద్ధి జీవిగా మారాలంటే బుద్ధుని బోధనలు తెలుసుకోవాల్సిందే, ఆచరించాల్సిందే. చివరగా బుద్ధుడు దేవుడు కాదు, ఆయనది మతమూ కాదు, తనది ఆధ్యాత్మిక వాదం అంతకన్నా కాదు. బుద్ధుడు.. ఒక సంపూర్ణ మానవుడు, మానవుల దుఃఖ నిర్మూలన కోసం సంఘాన్ని కట్టి, అంధకారంలో వున్న మనందరి కోసం మార్గదాతగా, దీప స్తంభమై నిలిచిన వైతాళికుడు. ఆయన మనకు ఒక హేతుబద్ధమైన జీవన విధానం అందించాడు. బుద్ధుడి మార్గంలో నడవడం అంటే బుద్ధుడిని సజీవంగా నిలిపి ఉంచడమే.

సంపతి రమేష్ మహారాజ్
79895 79428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News