పహల్గ్గాం ఉగ్రదాడి భారతదేశ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. అమాయకులైన పర్యాటకులను మతం పేరు అడిగి మరీ చంపిన విధానాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఆవేదనలు వెల్లువెత్తాయి. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఉగ్రవాద స్థావరాలపై సంచలనాత్మక ప్రతీకార చర్యగా నిలిచింది. శత్రు శిబిరాల్లోని వందకు పైగా ఉగ్రవాదులను (india vs pakistan war) మట్టుబెట్టడం ద్వారా భారత సైన్యం తమ నిపుణతను, ధైర్యాన్ని మరోసారి నిరూపించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలు ఒక్కటైన తీరు, రాజకీయాలను వీడి ఏకమైన నాయకుల ప్రవర్తన, ప్రతి భారతీయుడి గుండె చప్పుడులో ఉగ్రవాదాన్ని అణచివేయాలనే ఆకాంక్ష, అన్ని కలిసి దేశంలో జాతీయ చైతన్యాన్ని రగిలించాయి.
కానీ, పరిస్థితి ఇక్కడితో ఆగలేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్ (india vs pakistan war) కాల్పులకు తెరలేపింది. పాకిస్తాన్ ప్రతీ ఒక్క దాడికి భారత సైన్యం అనూహ్య ధైర్యంతో, సమర్థవంతంగా బదులిచ్చింది. ఈ పరిణామాల వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉధృత స్థాయికి చేరాయి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం తప్పదేమోననే భావన అంతర్జాతీయంగా ఆందోళన వెల్లువెత్తాయి. ప్రపంచంలోని దేశాలన్నీ భారత్ -పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎంతవరకు వెళతాయేమోనని ఆందోళన చెందాయి. ఇటువంటి ఉద్విగ్న వాతావరణంలో ‘కాల్పుల విరమణ’ అనే ప్రకటన ఒక్కసారిగా వినిపించడం దేశప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా? లేక అంతర్జాతీయ ఒత్తిడికి స్పందనగా వచ్చిన ఫలితమా? అనే సందేహాలు, అనుమానాలు దేశ మొత్తం విస్తరించాయి. దేశ ప్రజలలో నెలకొన్న ఈ సందేహాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ మరింత బలపరిచింది. ఆయన ట్వీట్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్న ఊహాగానాలకు ఊపునిచ్చింది. అమెరికా అధినేత ఈ పరిణామాల్లో భాగం కావడం అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో 2025 మే 12న, భారత్ పాకిస్తాన్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజిఎంఒ) స్థాయిలో హాట్‌లైన్ ద్వారా కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చలలో ప్రధానంగా చర్చించబడిన అంశాలు, పూర్తి కాల్పుల విరమణ: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద రెండు దేశాలు కాల్పులు జరగకుండా పరస్పర అంగీకారానికి వచ్చాయి. సైనికుల తగ్గింపు: సరిహద్దు, ముందస్తు ప్రాంతాలలో సైనికుల సంఖ్యను తగ్గించే చర్యలను వెంటనే అంగీకరించారు. శాంతి, స్థిరత్వం: పరస్పర శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఎటువంటి శత్రుత్వ చర్యలు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఈ చర్చలు, 2025 మే 10న ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు, సరిహద్దు ప్రాంతాలలో శాంతిని పునరుద్ధరించేందుకు కీలకంగా ఉన్నాయి. అయితే, ఈ డిజిఎంఒల చర్చల తర్వాత కొన్ని గంటల్లోనే, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు జరిగాయనే వార్తలు కొన్ని వచ్చాయి. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ప్రస్తుతం పరిస్థితి సున్నితంగా ఉంది, రెండు దేశాలు పరస్పరం శాంతిని కాపాడేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ చర్చలు మొదటి దశ మాత్రమే.
భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన చర్చలు, రెండు దేశాల మధ్య మారుతున్న దృక్పథానికి సంకేతంగా భావించవచ్చు. ఈ చర్చలు ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తున్నా వీటి వెనక దాగిన మౌలిక ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధ వాతావరణం నుండి చర్చల దశకు జరిగిన ఈ మార్పు ఒక ఊరట నిచ్చే అంశమే. అయితే, ఈ మార్పు తాత్కాలిక శాంతికి సంకేతమా? లేక దీర్ఘకాలిక సుస్థిరతకు మార్గనిర్దేశమా? అనే ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2025 మే 12న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. ఆ దాడిలో అమాయక ప్రజల ప్రాణాలు పోవడం దేశాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైందని, భారతదేశ సైనికుల వీరత్వానికి నిదర్శనమని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని, భవిష్యత్తులో కూడా దేశ భద్రతకు భంగం కలిగించే శక్తులపై భారత్ తగిన తీరులో స్పందిస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్ కఠిన పరిణామాలకు సిద్ధంగా ఉండాలని మోడీ స్పష్టంగా హెచ్చరించారు. శాంతి కోసం మన ప్రయత్నం కొనసాగుతుంది, కానీ దేశ భద్రతకు భంగం కలిగించే ఎవ్వరినీ విడిచిపెట్టం అనే ప్రధాని మోడీ సందేశం ఒక వైపు శాంతికి మద్దతు ఇస్తూనే, మరోవైపు దేశరక్షణ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోమనే సంకేతాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. శాంతికి మద్దతు, భద్రత విషయంలో రాజీ లేదు అనే ప్రధాని సందేశం మలిదశ చర్చలకు గట్టి పునాది వేసిందని చెప్పవచ్చు. ఈ మొత్తం పరిణామాలను సమగ్రంగా విశ్లేషిస్తే, కాల్పుల విరమణ వెనక వ్యూహాత్మక స్పష్టత ఉందా? లేక అంతర్జాతీయ ఒత్తిడికి లోబడి తీసుకున్న తాత్కాలిక నిర్ణయమా? అనే సందేహం ప్రజల మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.
శాంతి అత్యవసరం అయినా, అది స్థిరంగా నిలవాలంటే స్పష్టమైన దిశానిర్దేశం, బలమైన కార్యాచరణ అవసరం. శాంతి పేరుతో మౌనంగా తలవంచడం భవిష్యత్‌కి ప్రమాదకరంగా మారవచ్చు. శాశ్వత శాంతికి ధైర్యవంతమైన నిర్ణయాలు, ప్రజల రక్షణను కేంద్రీకరించిన వ్యూహం అవసరం. ప్రపంచ ఒత్తిడుల కంటే దేశ భద్రతే ప్రథమ లక్ష్యం కావాలి. యుద్ధం ఉపశమనం ఇవ్వదు, కానీ శాంతి నిలబడాలంటే దానిని భంగం చేసే శక్తులకు భయం కలిగించే సామర్థ్యం మనకు ఉండాలి. బలహీన దేశాల శాంతి ఎప్పుడూ దాడుల అంచులపై నడిచిందని, శాంతి కోసం మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చరిత్ర చెబుతుంది. అందుకే, శాంతిని మాటలతో కాదు, శక్తితో రక్షించాలి. శత్రువు మనపై దాడికి ముందు పది మేరలు ఆలోచించాలంటే, మన దగ్గర అగ్ని పేటిక ఉందనే భయం ఉండాలి. – అది అణ్వాయుధం కావచ్చు, అధునాతన సైనికశక్తి కావచ్చు, అంతర్జాతీయ మద్దతు కావచ్చు. కనికరం లేకుండా ఉగ్రవాద దేశాలకు ఇవ్వవలసిన సందేశం ఒకటే: ‘మన దేశాన్ని తాకడమంటే చితిమంటకు ఆహ్వానం’ పలకడమని. జై భరత మాత.
ననుబోలు రాజశేఖర్
98857 39808