Wednesday, May 14, 2025

పిఒకె మనకు దక్కుతుందా?

- Advertisement -
- Advertisement -

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి సాధించుకోవాలన్న పట్టుదలతో భారత ప్రభుత్వం ఉంటోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను (kashmir story ) అప్పగించడం మినహా మరో విషయం లేదని, అంతకు మించి మాట్లాడేది లేదని స్పష్టం చేసింది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ చూపించినా దానికి భారత్ ఒప్పుకోవడం లేదు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని కరాఖండీగా చెప్పింది. చారిత్రాత్మకంగా ఒకప్పుడు కశ్మీర్ రాచరిక రాష్ట్రంలో భాగమైన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)ను 1947లో పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది.

1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పుడు భారతదేశంలో లేదా పాకిస్థాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం అనే ఎంపికకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (kashmir story ) బ్రిటిష్ వారు అవకాశం కల్పించారు. ఆ సమయంలో జమ్మూకశ్మీర్ పాలకుడు మహారాజు హరిసింగ్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే హోదాను ఎంచుకున్నారు. అయితే 1947లో ఫూంచ్‌లో హరిసింగ్ ఆ ప్రాంత రైతులపై విధించిన శిక్షాత్మక పన్నుల కారణంగా తిరుగుబాటు తలెత్తింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో వాయువ్య సరిహద్దు ప్రావిన్స్‌కు చెందిన వేలాది మంది పష్టున్ గిరిజనులు మహారాజా పాలన నుంచి జమ్మూకశ్మీర్‌కు విముక్తి కల్పించాలన్న లక్షంతో పాకిస్తాన్ సైన్యం మద్దతుతో పోరాటం సాగించారు. పరిస్థితిని అదుపు చేయడంలో మహారాజా హరిసింగ్ సైన్యం విఫలమైంది.

ఫలితంగా తిరుగుబాటుదారులు ఫూంచ్ జిల్లాలో ఎక్కువ భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ముజఫరాబాద్, బారాముల్లాలను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించారు. ఇక చేసేదిలేక భారత ప్రభుత్వ సహాయాన్ని మహారాజా కోరారు. దానికి భారత ప్రభుత్వం ఒక షరతు విధించింది. భారతదేశంలో జమ్మూకశ్మీర్ విలీనం ఒప్పందానికి అంగీకరిస్తూ సంతకం చేయాలని సూచించింది. దాంతో మహారాజు హరిసింగ్ అంగీకరించారు. జమ్మూకశ్మీర్ రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ నియంత్రణను భారత ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం సంభవించింది. ఫలితంగా రెండు ప్రాంతాలపై స్థిరనియంత్రణ లభించింది. పాకిస్తాన్ మద్దతుగల తిరుగుబాటుదారుల ప్రభావంలో ఉన్న ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌గా ఇప్పుడు పిలవబడుతున్నది.

పేరుకే స్వయం పరిపాలనా ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ పరిపాలిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్‌గా వ్యవహరిస్తోంది. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన గిల్గిట్ బల్టిస్థాన్ (గిల్గిట్ బల్టిస్థాన్ ఆజాద్ కశ్మీర్‌లో భాగం కాదు). దక్షిణాన పాకిస్తాన్ పంజాబ్, పశ్చిమాన ఖైబర్ పఖ్తూన్‌క్వాలు ఉన్నాయి. తూర్పు వైపున జమ్మూకశ్మీర్ ఉంది. ఈ రెండింటి మధ్య నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) ఉంది. ఇది భారత, పాకిస్తాన్ మధ్య వాస్తవ సరిహద్దుగా పనిచేస్తుంది. భౌగోళికంగా ఈ భూభాగం మొత్తం వైశాల్యం 13,297 కి.మీ (5134 చదరపు మైళ్లు). ముజఫరాబాద్ నగరం దీని రాజధాని. 2017 జాతీయ జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 40,45,366. దాదాపు జనాభా అంతా ముస్లింలే. పిఒకెలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. అధ్యక్షుడు రాజ్యాంగబద్ధమైన దేశాధినేత కాగా, ప్రధాన మంత్రి, మంత్రుల మండలి మద్దతుతో కార్యానిర్వాహకత్వం వహిస్తారు. ఏకసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఇద్దరినీ ఎన్నుకుంటుంది. స్వంత సుప్రీం కోర్టు, హైకోర్టు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వ కశ్మీర్ గిల్గిత్ బాల్టిస్థాన్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, పాకిస్థాన్ ప్రభుత్వానికి, పిఒకె ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. అయితే దీనికి పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేదు. పిఒకెలోని ఉత్తరభూభాగం తరచుగా తీవ్ర భూప్రకంపనాలకు గురవుతుంది. 2005లో సంభవించిన భారీ భూకంపం వల్ల లక్షమంది మృతి చెందగా, మరో 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

దీనివల్ల ఈ ప్రాంతం మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ విధ్వంసమయ్యాయి. వ్యవసాయం, పర్యాటకం, సేవలు పైనే ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఒకవంక పాకిస్తాన్, మరోవంక విదేశీ సాయాలతోనే పిఒకె మనుగడ సాగిస్తోంది. దాదాపు 87% పిఒకె కుటుంబాలకు వ్యవసాయ భూములు ఉన్నాయి. పిఒకెలో ద్రవ్యోల్బణ ఒత్తిడి ఎక్కువగానే ఉంది. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ ఉదారవాద విధానాలు, నిరుద్యోగం, అధిక వలసలు ఇవన్నీ తీవ్ర సమస్యలుగా వెంటాడుతున్నాయి.

నిరుద్యోగ రేటు 33% వరకు ఉంది. ఉపాధి కోసం యువత గల్ఫ్‌దేశాలకు వలసపోతున్నారు.గత కొన్ని రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, పిఒకెలో ఉన్న వనరులను స్థానిక ప్రజలకు కాకుండా పాక్‌లోని ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం తరలించుకుపోతుండడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఇక్కడి జలవిద్యుత్‌ను పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాలు, నగరాలకు సరఫరా కోసం తరలిస్తున్నారని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. హక్కుల కోసం ప్రజలు వీధికెక్కుతున్నారు. ఈ పరిణామాలన్నీ పిఒకెపై పాకిస్థాన్ ప్రభుత్వ పట్టుకోల్పోడానికి దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ గమనించి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తమ పాలన లోకి తెచ్చుకోవాలని భారత ప్రధాని మోడీ ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు చర్చల్లో ఇదే ప్రధాన అజెండాగా నిలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News