ఇండోర్: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ గురించి కర్నల్ సోఫియా ఖురేషి(Sofiya Qureshi) వివరించిన విషయం తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ బిజెపి చెందిన మంత్రి సోఫియా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచివేస్తే.. వాళ్ల(ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో పంపి మోదీజీ పాక్‌కి గుణపాఠం నేర్పించారు’ అంటూ మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా (Vijay Shah) వ్యాఖ్యానించారు.
దీంతో దీనిపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ.. కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విజయ్ షా(Vijay Shah) వ్యాఖ్యలు సిగ్గు చేటు అని ఆయన అన్నారు. దీంతో మధ్యప్రదేశ్ బిజెపి మంత్రిని పిలిచి చీవాట్లు పెట్టింది. అయితే దీనికి విజయ్ షా వివరణ ఇచ్చారు. ఉగ్రవాదుల చర్యలకు మనసు వికలమై.. అలా మాట్లాడానని అన్నారు. కులమతాలకు అతీతంగా సోషియా(Sofiya Qureshi) చేసిన సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకానీ.. ఆమెను కించపరచాలనే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే.. పదిసార్లు క్షమాపణ చెప్తానని అన్నారు.