టీమిండియా స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) గుడ్ న్యూస్ చెప్పింది. టీ20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించినా.. రోహిత్, కోహ్లీలను ‘ఏ ప్లస్’ గ్రేడ్‌లోనే కొనసాగిస్తామని బిసిసిఐ వెల్లడించింది. ఈ మేరకు కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడేతూ.. రోహిత్, కోహ్లీలు A-ప్లస్ కేటగిరీలోనే ఉంటారని తెలిపారు. అక్టోబర్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 మధ్య కాలానికి కుదిరిన కాంట్రాక్టులో భాగంగా గతంలో వారు పొందిన A-ప్లస్ కేటగిరీ సౌకర్యాలు.. ఇప్పుడు కూడా లభిస్తాయని చెప్పారు. సాధారణంగా టీం, వన్డే, టెస్టు.. మూడు ఫార్మాట్లకు ఆడే ప్లేయర్లకు మాత్రమే A-ప్లస్ కేటగిరీ కాంట్రాక్టు లభిస్తుంది.
కాగా, మే 7న రోహిత్ శర్మ, మే 12 విరాట్ కోహ్లీలు.. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, వీరి రిటైర్మెంట్ పై పలువురు దేశ, విదేశి మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా త్వరగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు అని, అద్భుతమైన ఆటగాళ్లు తమకు 50 ఏళ్లు వచ్చేంత వరకు రిటైర్‌మెంట్ ప్రకటించకూడదు అని యువరాజ్ సింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ స్పందిస్తూ..” టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ రిటైర్‌మెంట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. అత్యద్భుతమైన టెస్ట్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అకస్మాత్తుగా అతడు టెస్టుల్లోంచి తప్పుకోవడం నన్ను విస్మయానికి గురి చేసింది” అని జేమ్స్ అండర్సన్ పేర్కొన్నారు.