జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో నేడు ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతీ ఘాట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం, కాళేశ్వర త్రివేణీ సంగమంలో ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాల్లో పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతీ మహా పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నేడు (15వ తేదీన) ఉదయం 5 .44 గంటలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పాటు పుష్కర స్నానం చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 8. 30 గంటల నుంచి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సరస్వతీ ఘాట్‌లో 6 .45 గంటల నుంచి 7 .35 గంటల వరకు సరస్వతీ ఘాట్‌లో ప్రత్యేక సరస్వతీ నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. పుష్కర్ స్నానం ఆచరించే వారికి తాత్కాలిక టెంట్ సిటీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రోజూ రాత్రి కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిధునరాశిలో
సరస్వతి నదిని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే ‘అంతర్వాహిని‘ (అదృశ్య నది) గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశి (మిథునరాశి)లోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు స్నానాన్ని ఆచరిస్తారు. బృహస్పతి దేవ గురువు, బృహస్పతి జ్ఞానం, విద్య , ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడతారు. బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటారు. ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 ఏళ్లు పడతాయి. ఏ రాశిలో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14వ తేదీన రాత్రి 10.35 గం మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు. సరస్వతీ నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహిస్తుంది. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని, కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు. మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పుష్కర కాలం ఉంటుందని అర్చకులు తెలిపారు.