వివాహం చేసుకుంటానని చెప్పి వైద్యురాలిపై లైంగికదాడి చేసి, డబ్బులు తీసుకుని పరారైన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఢిల్లీ, ఘజియాబాద్‌కు చెందిన యువతి(28) ఎంబిబిఎస్ పూర్తి చేసి కాస్మోటాలజీలో స్పెషలైజేషన్ చేసింది. బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్‌గా ఆరు నెలల క్రితం చేరింది. అదే సంస్థలో హెచ్‌ఆర్ హెడ్‌గా పనిచేస్తున్న భరత్(33) అనే వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత యువతిని ప్రేమించానని, వివాహం చేసుకుంటానని చెప్పాడు. నిందితుడి మాటలు నమ్మిన యువతి అతడితో సన్నిహితంగా ఉంటోంది. ఇద్దరి విషయం తెలిసిన సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తీసివేశారు. దీంతో ఇద్దరు రోడ్డు నంబర్ 14లో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారం కోసం భరత్ యువతి వద్ద రూ.2.5లక్షలు తీసుకున్నాడు.
వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరు పలుమార్లు శారీరకంగా కలిశారు. ఈ క్రమంలోనే భరత్‌కు వివాహం అయిందని యువతికి తెలియడంతో అతడు నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి చూడగా ఆరు నెలల గర్భంతో ఉన్న భార్య ఉంది. విషయం చెప్పగా తన భర్త తప్పు చేశాడని, అతడిని వదిలిపెట్టాలని భరత్ భార్య కోరింది. ఈ విషయం తెలియడంతో భరత్ హైదరాబాద్ నుంచి పూణేకు పారిపోయాడు. తనను వివాహం చేసుకుంటానని, శారీరకంగా వాడుకోవడంతోపాటు డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై బిఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు.