ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్‌కు లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ప్రకటలో వెల్లడించింది. గతంలో నీరజ్ చోప్రా భారత సైన్యంలో సుబేదార్‌గా వ్యవహరిచారు. తాజాగా ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన లెఫ్టినెంట్ కర్నల్ హోదా లభించింది. టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
అంతేగాక పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కూడా నీరజ్ పతకం సాధించారు. ఈ క్రీడల్లో ఆయన రజతం గెలిచారు. కాగా, నీరజ్‌కు పలు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం నీరజ్‌కు పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించింది. అంతేగాక భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర పురస్కారాన్ని కూడా నీరజ్ అందుకున్నారు. అంతేగాక 2022లో పద్మశ్రీ అవార్డు కూడా నీరజ్‌ను వరించింది. కాగా, భారత క్రీడారంగానికి చెందిన ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా తదితరులు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను దక్కించుకున్నారు. తాజాగా వీరి సరసన నీరజ్ చోప్రా చేరారు.