పురాతన రామప్ప ఆలయంలో పూజలు
ఎల్ఇడి ద్వారా వీక్షించిన మంత్రి సీతక్క
తెలుగుదనం ఉట్టిపడేలా పట్టుచీర, పట్టు పరికిణీల ధారణ గిరిజన సాంప్రదాయ కొమ్ము, కోయ నృత్య ప్రదర్శనలతో కళాకారుల స్వాగతం
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి/వరంగల్ కార్పొరేషన్: ప్రపంచ సుందరీమణులు బుధవారం వరంగల్, ములుగు జిల్లాల్లో సందడి చేశారు. ములుగు జిల్లా, రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు బుధవారం సందడి చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పి శభరీష్, జిల్లా టూరిజం శాఖ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. గుస్సాడి నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ద్వారా కళాకారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలోకి చేరుకున్న సుందరీమణులు ఎవరికి వారే స్వయంగా కాళ్ళు కడుక్కుని పూజలు చేసేందుకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామప్ప ఆలయ విశిష్టత, చరిత్రను అడిగి తెలుసుకున్నారు. పురాతన ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆలయ తీరుతెన్నులను తనివితీరా తిలకించి ఫిదా అయ్యారు.
తెలుగుదనం ఉట్టిపడేలా…
ప్రపంచ సుందరీమణులు తెలుగు తనం ఉట్టిపడేలా పట్టుచీర, పట్టు పరికిణీలు కట్టుకొని, తిలకం దిద్దుకొని అచ్చం తెలంగాణ అమ్మాయిలను మరిపించేలా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టతను తెలుసుకున్న వారు ఆలయానికి సంబంధించిన చిత్రాలను తమ సెల్ఫోన్లో బంధించి ఆనందించారు. కాగా, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి చేరుకున్న సుందరీమణులకు స్వాగతం పలికేందుకు పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) రామప్పకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రపంచ సుందరీమణులు పూజలను ఎల్ఈడి ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో కాకతీయ రాజుల పరిపాలన, చారిత్రాత్మక ఆంశాలను నృత్యరూపంలో కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజల ప్రదర్శించారు. మంత్రి వెంట ఫైనాన్స్ కమి షన్ రాష్ట్ర ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ, ఏటూరునాగారం ఎఎస్పి శివమ్ ఉపాధ్యాయ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోతు రవిచందర్, జిల్లా అధికారులు ఉన్నారు.
చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ సుందరీమణులు బుధవారం సాయంత్రం సండి చేశారు. హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించగా అక్కడ చిన్నారులు వారికి స్వాగతం పలికారు. దేవాలయ అర్చకులు పూజలు నిర్వహించి శాలువాలతో సన్మానించారు. అనంతరం ప్రపంచ సుందరీమణులు హన్మకొండ వేయి స్తంభాల దేవాలయం నుంచి పోలీసులు అత్యంత భారీ బందోబస్తు నడుమ ఖిలా వరంగల్ కోటకు రాత్రి 7.30 గంటలకు చేరుకోగా జిల్లా యంత్రాంగం స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన పసుపు మిర్చి, దర్రీస్, హస్త కళల పలు స్టాల్స్‌ను ప్రపంచ సుందరీమణులు సందర్శించి వాటి గురించి తెలుసుకున్నారు. అనంతరం ఖిలా వరంగల్ చరి త్ర, కాకతీయుల చరిత్ర, రుద్రమాదేవి, గణపతి దేవరాజుల చరిత్రపై వివరించగా ప్రపంచ సుందరీమణులు విని ముగ్ధులయ్యారు.ప్రపంచ కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ సుందరీమణులు ఖిలా వరంగల్‌కు రాగా మంత్రి వారిని అభినందించారు.