కాళేశ్వరం వద్ద సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ పుష్కరస్నానం ఆచరించారు. గురువారం సాయంత్రం కాళేశ్వరం చేరుకున్న సిఎం రేవంత్.. సరస్వతీ పుష్కర ఘాట్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పుష్కరస్నానం ఆచరించారు. ఆ తర్వాత సరస్వతీదేవి విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారు.
కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తోంది. కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమ తీరంలో ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు సుమారుగా 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాళేశ్వరం యాప్, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించి, భక్తులు సాంకేతికంగా పొందే సేవలను సైతం అందులో పొందుపరిచారు. సదరు పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సుమారు 50 వేలకు పైగా భక్తులు వచ్చి పుష్కర స్నానం చేయడంతో పాటు పిండప్రదానం, దంపతీ స్నానం, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లను దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.