నేడు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు
: కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైనికుల శక్తిని కొనియాడుతూ చేపడుతున్న తిరంగా యాత్రలో(Tiranga Yatra) పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, భారత సైన్యం సమర్థవంతంగా దాడి చేసిందని, అనేక ఉగ్రవాదులను అంతమొందించిందని తెలిపారు. ఈ దాడి ద్వారా భారతదేశం తన శక్తిని ప్రదర్శించిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసిందని తెలిపారు.
దేశ సైనిక శక్తి, భారత దేశ సమర్థతను తెలియజేస్తూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద శనివారం సాయంత్రం తిరంగా యాత్ర పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్లో పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా 26 మందిని కాల్చి చంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటనను యావత్ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించిందని తెలిపారు. మానవ సమాజానికి సవాలుగా నిలిచిన, సెక్యులరిజానికి భంగం కలిగించి, దేశ సమగ్రతకు సవాలుగా మారిన ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారని అన్నారు.
ఆ తర్వాత మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప్రపంచం ప్రశంసించే విధంగా మట్టుబెట్టారని కొనియాడారు. ఉగ్రవాదాన్ని తయారుచేసే డెమొక్రసీ ఫ్యాక్టరీగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించడంతోపాటు, వారిలో మానసిక ధైర్యాన్ని పెంచి అండగా నిలబడేందుకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై, ట్యాంక్‌బండ్‌పై ఉన్న వివేకానంద విగ్రహం వరకు జరగనున్న తిరంగా యాత్ర (Tiranga Yatra)కార్యక్రమంలో అనేక ప్రముఖులను రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించామని చెప్పారు. తిరంగా యాత్ర కార్యక్రమం ప్రజలు నిర్వహించే ప్రోగ్రామని, ఒక కేంద్రమంత్రిగా, స్థానిక పార్లమెంటు సభ్యుడిగా తాను బాధ్యతగా తిరంగా యాత్ర కార్యక్రమంలో యువజన సంఘాలు, విద్యార్థులు, మహిళా సంఘాలు ఇలా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత సైనికులకు సంఘీభావం ప్రకటించాలని ఆహ్వానిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.