అమెరికా నుంచి భారత్‌కు పంపే
డబ్బుపై 5 శాతం పన్ను ఈ
మేరకు ప్రతినిధుల సభలో ట్రంప్
బిల్లు ఆమోదం పొందితే
హెచ్-1బి వీసాదారులకు భారం
వాషింగ్టన్ డిసి: అమెరికాలోని వారు తమ కుటుంబసభ్యులకు పంపే డబ్బు పైనా ట్రంప్ కోత పెడుతున్నాడు. ఆమెరికా పౌరులు కానివారు విదేశాలకు చేసే చెల్లింపులపై 5 శాతం పన్ను విధించే కొత్త బిల్లును ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన కొత్త బిల్లు హెచ్ -బి వీసాదారులు, గ్రీన్ కార్డు కలిగిన వారితో సహా అమెరికా పౌరులు కానివారు దేశం వెలుపలకు పంపే అన్ని చెల్లింపులపై 5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తున్నది. ఈ బిల్లు చట్టం అయితే అమెరికా నివసిస్తున్న , పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులపై నేరుగా ప్రభావం చూపుతుంది. వారు క్రమం తప్పకుండా స్వదేశంలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపుతూ ఉంటారు.
అమెరికా హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ఓ నివేదికను ఇటీవల విడుదల చేసింది. 389 పేజీల నివేదికలో 327వ పేజీలో ఇటువంటి డబ్బు బదిలీలలో 5శాతానికి సమానమైన పన్ను తప్పని సరి చేసే నిబంధన దాగి ఉంది. కనీస పరిమితిని నిర్ణయించలేదు. అంటే పంపిన వారు అమెరికా పౌరుడు కాని పక్షంలో చిన్న లావాదేవీలపై కుడా పన్ను విధించబడుతుందని పేర్కొంది.నివేదిక ప్రకారం ఈ పన్నును బ్యాంకు లేదా డబ్బు బదిలీ చేసే రెమిటెన్స్ ప్రొవైడర్ బదిలీ సమయంలో వసూలు చేస్తారు. అయితే అమెరికా పౌరులకు ఈ నిబంధన వర్తించదు.