రష్యా విదేశాంగ మంత్రి లావ్రోస్ వెల్లడి
మాస్కో : విభజించి పెత్తనం సాగించు అనేది అమెరికా పాలసీ అని రష్యావిదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ విమర్శించారు. రాజకీయ ఆధిపత్య చదరంగంలో భాగంగా అమెరికా సారధ్యపు పశ్చిమ కూటమి తరచూ భారత్‌ను చైనాకు వ్యతిరేకంగా ఉసికొల్పుతోందని, ఈ రెండు అత్యంత కీలకమైన భౌగోళిక ప్రాముఖ్యతల దేశాల మధ్య చిచ్చు రగిల్చేందుకు పావులు కదుపుతోందని విమర్శించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విద్వేష వాదనను రేకెత్తించి ఈ వేర్పాటు విభజన రేఖలను అమెరికా తనకు అనుకూలంగా మల్చుకొంటోందని తెలిపారు.
ఈ విషయాన్ని భారత్ చైనాలు ఇకనైనా గ్రహించాల్సి ఉందన్నారు. ఇరుగుపొరుగుదేశాల మధ్య అగాధం పెంచడం ద్వారా ఆసియా ప్రాబల్యం దెబ్బతినేలా చేయడం అమెరికా , మిత్రదేశాల లక్షం అన్నారు. ఇండియా చైనాలు రెండూ రష్యాకు అత్యంత స్నేహదేశాలు అయితే రష్యాను దెబ్బతీసేందుకు అమెరికా ఎప్పుడూ ఇండియా చైనా మధ్య అగ్గి రాజుకునేలా చేయడం రివాజు అయిందని విమర్శించారు. విభజించు , విద్వేషాలు పెంచు అనేది అమెరికా పాలసీ అని, దీనిని అంతా గుర్తించాల్సి ఉందని, ప్రత్యేకించి ఇండియా చైనాలు అమెరికా వైఖరితో తమకు కల్గుతున్న నష్టాన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవల్సి ఉందని చెప్పారు. భారత్ చైనా సమైక్యత ఆసియాను ప్రపంచంలో తిరుగులేని శక్తిని చేస్తుంది, ఇది ప్రపంచ శాంతి సుస్థిరతలకు దోహదం చేస్తుందని రష్యా అధికారిక వార్తాసంస్థ టాస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.