Sunday, May 18, 2025

‘విరమణ’పై విమర్శల జడివాన

- Advertisement -
- Advertisement -

భారత్- పాకిస్తాన్ మధ్య ఇటీవల సైనిక ఉద్రిక్తతలు, మే 10, 2025న కాల్పుల విరమణతో ముగిసినప్పటికీ ఈ నిర్ణయం చుట్టూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్రచర్చలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, స్పష్టమైన సైనిక ఆధిపత్యం చాటిన భారత్, విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనవసర జోక్యం, ఆయన చేసిన అసందర్భ వ్యాఖ్యలు భారత ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల తాకిడికి దారితీశాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం అసాధారణ పటిమతో ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాకిస్థాన్ యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీసిన ఈ ఆపరేషన్, భారత్‌ను ఆధిపత్య స్థానంలో నిలిపింది.

పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లు, మిస్సైళ్లు నాశనమయ్యాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ అనూహ్యంగా కాల్పుల విరమణకు అంగీకరించడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో కాల్పుల విరమణను తానే సాధించానని, భారత్ పాక్‌లు తన మాట విన్నాయని పదే పదే ప్రకటించడం ప్రధాని మోడీ ఇమేజ్‌ను నువ్వులపాలు చేసింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఈ వ్యాఖ్యలు, 1972 సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించేలా మూడో పక్షజోక్యాన్ని సూచిస్తాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ మీడియాలో మోడీ నిర్ణయం బలహీనతగా చిత్రీకరించబడుతోంది. అంతర్జాతీయంగా బిబిసి, ఒన్ న్యూస్ బిడి వంటి సంస్థలు ట్రంప్ మధ్యవర్తిత్వం భారత్‌ను ఇరకాటంలోకి నెట్టిందని విశ్లేషించాయి.

ట్రంప్ కశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వం ప్రతిపాదించడం, భారత్ ముఖ్యంగా భారత ప్రధాన మంత్రి హోదాలో దాన్ని దృఢంగా, స్పష్టంగా తిరస్కరించి మాట్లాడలేకపోవడం విమర్శలను మరింత తీవ్రతరం చేసింది. సోషల్ మీడియాలో నెటిజన్లు మోడీ నిర్ణయం భారత ఇమేజ్‌ను దెబ్బతీసిందని, బిజెపి (మోడీ) అమెరికా (ట్రంప్) ఒత్తిడికి తలొగ్గినట్లేనని, భారత ప్రతిష్ఠను దిగజార్చేలా మోడీ మోకరిల్లటం భారత ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. భారత సైనిక వీరోచిత పోరాటాన్ని మసక బారేలా ఈ అర్ధంతర యుద్ధవిరమణ నిర్ణయం నీరుగార్చింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థల నుంచి, వ్యక్తిగతంగా మోడీ అభిమానులు నుండి కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ నిర్ణయంపై భారత దేశంలో ఏ వర్గమూ సమర్ధించేలా లేదు. చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ ప్రజలు ఉత్సాహంగా వీధుల్లో ఊరేగింపు చేసుకుంటున్నారు. అన్ని విధాలా మన సైనికులు పైచేయి సాధించినా ఈ నిర్ణయంతో ప్రజల్లో నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ ఆవరించింది.

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థల నుంచి కూడా అసంతృప్తి స్వరాలు ఉచ్ఛస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ సంస్థలు దీర్ఘకాలంగా ఉగ్రవాదంపై, పాకిస్థాన్‌పై గట్టి వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌ను జాతీయ గర్వంగా కొనియాడిన ఈ సంస్థలు, కాల్పుల విరమణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. సోషల్ మీడియాలో బిజెపి అనుకూల ఖాతాల (గోది మీడియా) నుండి ‘మోదీ నిర్ణయాన్ని’ తక్కువ స్వర స్థాయిలో సమర్థిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ నిర్ణయం జాతీయవాద భావనలకు విరుద్ధమని భావిస్తున్నారు. తమ అధికార పత్రికలో కూడా ఇదే భావం వ్యక్తం చేశారు. మోడీ నిర్ణయం వెనుక దౌత్యపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు కారణమై ఉండవచ్చు. ట్రంప్ వాణిజ్య బెదిరింపులు, అమెరికాతో వ్యాపార సంబంధాలు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయి అని విశ్లేషకులు అంటున్నారు.

అయితే, ఈ నిర్ణయం సైనిక విజయాన్ని దౌత్యపరమైన రాజీగా మార్చిందని, భారత్ బలమైన స్థితిని చేజేతులా వదులుకుందని విమర్శలు వస్తున్నాయి. మోడీ తన ప్రసంగంలో ఉగ్రవాదంపై గట్టి వైఖరిని పునరుద్ఘాటించినప్పటికీ ట్రంప్ జోక్యాన్ని స్పష్టంగా తోసిపుచ్చలేకపోవడం విమర్శలకు ఆజ్యం పోసింది. ఈ సంఘటన భారత విదేశాంగ విధానంలో కీలక చర్చను రేకెత్తించింది. సిమ్లా ఒప్పందం స్ఫూర్తిని కాపాడుకోవడం, అంతర్జాతీయ ఒత్తిళ్లను సమతుల్యం చేయడం భారత్‌కు సవాలుగా మారింది. మోడీ నిర్ణయం దీర్ఘకాలంలో శాంతిని, స్థిరత్వాన్ని తెస్తుందా? లేక దేశ ప్రతిష్ఠకు బలహీనతగా మిగిలిపోతుందా అనేది సమయమే నిర్ణయిస్తుంది. అప్పటివరకు, ఈ విమర్శలు భారత రాజకీయ, సామాజిక వాతావరణంలో తీవ్ర చర్చనీయాంశంగా కొనసాగుతాయి.

  • కె. ఆర్ కిశోర్- 98493 28496
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News