ముంబై విమానాశ్రయ పోలీసులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రసిద్ధ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ను పెల్చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, ఈ ఇమెయిల్ నేరుగా పోలీసుల అధికారిక ఇమెయిల్ ఐడికి పంపబడింది. ఉగ్రవాది అఫ్జల్ గురు, సాయిబాబు శంకర్ ఉరిశిక్షలను బెదిరింపు మెయిల్‌లో దుండగులు ప్రస్తావించినట్లు సమాచారం. వారిద్దరిని అన్యాయంగా ఉరితీశారని ఆరోపిస్తూ..ముంబైలోని రెండు ప్రముఖ ప్రదేశాలపై దాడులు చేస్తామని బెదిరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బెదిరింపు ఈమెయిల్ అందిన వెంటనే ముంబై పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయం, హోటల్ ప్రాంగణాలను స్కాన్ చేయడానికి బృందాలను నియమించారు. రెండు ప్రదేశాలలో భద్రతను పెంచారు. ముంబైలోని కీలక ప్రదేశాలలో నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు చెప్పారు. ఈమెయిల్ ద్వారా బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించడానికి అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.