హైదరాబాద్: సినిమాలో ఏదైనా పాట హిట్ అయిందంటే.. దాన్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కష్టం ఎంత ఉంటుందో.. ఆ పాటకి స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ కష్టమూ అంతే ఉంటుంది. కానీ, కొన్నిసార్లు కొన్ని పాటలు సూపర్ హిట్ అయినా.. కొరియోగ్రాఫర్‌కి తగిన గుర్తింపు లభించదు. అలాంటి పరిస్థితే తనకు వచ్చింది అంటున్నారు బోస్కో మార్టిస్(Bosco Martis). ఎన్టిఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందులోనూ ప్రత్యేకంగా ఎన్టిఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్‌పై రూపొందించిన ‘చుట్టమల్లె’ (Chuttamalle) సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
‘చుట్టమల్లె’ (Chuttamalle) పాటకి అనిరుధ్ స్వరాలు అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటను కొరియోగ్రాఫీ చేసింది బోస్కో మార్టిసే. కానీ, ప్రమోషన్స్ సమయంలో తన గురించి పెద్దగా మాట్లాడకపోవడం ఎంతో బాధ కలిగించిందని బోస్కో(Bosco Martis) అన్నారు. కనీసం జాన్వీకపూర్ అయినా.. తన గురించి మాట్లాడుతుంది అని అనుకున్నాను కానీ, అది కూడా జరగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హిందీలో ‘బ్యాడ్ న్యూస్’ అనే చిత్రంలోని ‘తౌబా తౌబా’ పాటకి తానే కొరియోగ్రాఫీ చేశానని చెప్పారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో విక్కీ కౌశల్ తన గురించి గొప్పగా చెప్పారని పేర్కొన్నారు. ఏదైనా పాటలు పాపులర్ అయినప్పుడు కొరియోగ్రాఫర్‌కు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ పరిశ్రమలో ఇది కొరవడిందని తెలిపారు.