ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల క్రమంలో పాకిస్తాన్ పై భారత్.. దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం.. అఖిలపక్షం ఏర్పాటు చేసి.. ఆ బృందాన్ని భాగస్వామ్య దేశాలకు పంపనుంది. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ దాడి తర్వాత భారత్.. సరిహద్దు ఉగ్రవాదంపై నిరంతర పోరాటాన్ని తెలియజేసేందుకు మే నెల చివరిలో కేంద్ర ప్రభుత్వం ఏడుగురు అఖిలపక్ష ప్రతినిధులను కీలక భాగస్వామి దేశాలకు పంపబోతోంది. ఈ అఖిలపక్షంలో కాంగ్రెస్ నుండి శశి థరూర్, బిజెపి నుండి రవిశంకర్ ప్రసాద్, జెడియు నుండి సంజయ్ కుమార్ ఝా, బిజెపి నుండి బైజయంత్ పాండా, డిఎంకె నుండి కనిమొళి కరుణానిధి, ఎన్‌సిపి నుండి సుప్రియా సులే, శివసేన నుండి ఏక్‌నాథ్ షిండే చోటు కల్పించారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. “ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరాటం నేపథ్యంలో అఖిలపక్ష ప్రతినిధులు ఈ నెల చివర్లో UN భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామి దేశాలను సందర్శిస్తారు. అన్ని రూపాల్లో, వ్యక్తీకరణలలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జాతీయ ఏకాభిప్రాయం, దృఢమైన విధానాన్ని అఖిలపక్ష ప్రతినిధులు ప్రదర్శిస్తారు. ఉగ్రవాదంపై శూన్య సహనం అనే బలమైన సందేశాన్ని వారు ప్రపంచానికి తెలియజేస్తారు” అని పేర్కొంది.