హైదరాబాద్: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైన నేపథ్యంలో నగరంలో తిరంగా యాత్రను (Tiranga Yatra) చేపట్టారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపి అరవింద్, డికె ఆరుణ, ఈటెల, మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
యాత్రలో భాగంగా అందరూ జాతీయ జెండాను పట్టుకొని.. భారతదేశానికి, సైన్యానికి మద్ధతుగా నినాదాలు చేశారు. అయితే ఈ ర్యాలీ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెల్లింగ్‌క్లబ్, డిబిఆర్ మిల్స్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. ర్యాలీ దృష్ట్యా రాత్రి 7.30 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.