మానవతా నీవెక్కడ?
పెంపుడు తల్లిని చంపేసిన కర్కశి
భువనేశ్వర్ : మానవత, దయాదాక్షిణ్యం , కనీస కృతజ్ఘత అనేది ఆనవాళ్లకు కూడా లేకుండాపోతోంది. ఒడిషాలో జరిగిన ఓ దారుణ హత్యోందంతం ఈ పచ్చి నిజాన్ని వెలుగులోకితీసుకువచ్చింది. భువనేశ్వర్‌లో 13 ఏండ్ల క్రితం రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఎండలో రోడ్డుపై కెవ్వు మంటూ ఏడుస్తున్న మూడురోజుల పసికందును చూసి రాజ్యలక్ష్మి అనే మహిళ చలించింది. ఎవరో వదిలేసివెళ్లిన పసిపాప అని నిర్థారించుకుని పాపను తీసుకువచ్చి సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచింది. ఈ పాపకు 13 సంవత్సరాలు వచ్చాయి. ఎనిమిదో తరగతిలోకి వచ్చింది. చెడు అలవాట్లకు లోనై , ఏకకాలంలో ఇద్దరు అబ్బాయిలతో చెడు తిరుగుళ్లకు దిగింది. ఇది పద్దతి కాదమ్మా అంటూ తల్లి రాజలక్ష్మి కార్ మందలించింది. దీనితో కోపం పెంచుకున్న ఈ పెంపుడు కూతురు తన పనికిమాలిన ప్రియులకు విషయం తెలియచేసింది.
ముసలామె ఆస్తులపై కన్నేసిన వీరు. ఈ అమ్మాయితో కలిసి రాజలక్ష్మిని చంపేశారు. ముందుగా టీలో నిద్ర మత్తు టాబ్లెట్లు ఇచ్చి తరువాత దిండుతో ఊపిరాడకుండా చేసి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె అప్పటికే చనిపోయి ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీనితోబంధువులకు గుండెపోటు వచ్చి చనిపోయిందని నమ్మించి అంత్యక్రియలు జరిపారు. తరువాతి దశలో వారం రోజులకు రాజలక్ష్మి బంధువు ఒక్కరు ఈ విషయంలో అనుమానాలు రావడంతో ఫిర్యాదు చేశారని గజపతి ఎస్‌పి జితేంద్ర కుమార్ పాండా తెలిపారు. దర్యాప్తు క్రమంలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. కీలక సమాచారం ఉన్న మూడు సెల్‌ఫోన్లు, రెండు దిండులు, మృతురాలికి చెందిన విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. సెల్‌ఫోన్ల సమాచారంతో కుట్రను ఛేదించినట్లు ఎస్‌పి తెలిపారు. పిల్లలు లేని తల్లి ఈ పిల్లను సొంత పిల్లగా పెంచుకుంటే చివరికి విషనాగుగా కాటేసిందని, ఈ ఉదంతం ఎన్నో నేరాలను పరిశోధించిన తనకు అత్యంత దారుణం అన్పించిందని ఎస్‌పి ఆవేదన చెందారు.