భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక పిఎస్‌ఎల్‌వి ప్రయోగం ఆదివారం విఫలం అయింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి అత్యంత విశ్వసనీయ పిఎస్‌ఎల్‌వి వాహకనౌక నుంచి భూ పర్యవేక్షక ఉపగ్రహ పరీక్ష జరిపి, ఈ శాటిలైట్‌ను నిర్ణీత కక్షలోకి పంపించాలని నిర్ణయించారు. అయితే ప్రయోగం తరువాత కొద్ది నిమిషాలకే పిఎస్‌ఎల్‌వి సాంకేతిక లోపాలతో కదలకుండా మొరాయించింది. దీనితో ఈ ప్రయోగం విఫలం అయినట్లు ఇస్రో గుర్తించింది. ఈ స్పేస్‌పోర్టు నుంచి ఇస్రోకు ఇది 101వ మిషన్. పిఎస్‌ఎల్‌వి సి 61 వాహక నౌక నిర్ణీత కాలం ప్రకారం తెల్లవారుజామున 5ః59 నిమిషాలకు తన లక్షాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అయితే మిషన్‌లో సరిగ్గా 12వ నమిషంలో రాకెట్‌లో లోపం తలెత్తినట్లు నిర్థారణ అయింది. ఆదివారం విఫలమైన యాత్ర గురించి ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ మీడియాకు ఆ తరువాత తెలిపారు. ఇది తమ సంస్థకు 101వ మిషన్. శ్రీహరికోట నుంచి దీనిని తలపెట్టాం.
పిఎస్‌ఎల్‌వి నాలుగంచెల వాహక నౌక , ప్రయోగపు రెండో దశ వరకూ అంతా సవ్యంగా సాగింది. అయితే మూడో స్టేజ్ కూడా బాగానే ఆరంభం అయింది. అయితే తరువాతి క్రమంలో లోపాలతో పిఎస్‌ఎల్‌వి మొండికేసిందని, నిర్ణీత లక్షం నెరవేరలేదని ఆయన వైఫల్యాన్ని అంగీకరించారు. మోటారు సంబంధిత సంచాలక వ్యవస్థలో తలెత్తిన ఛాంబర్ ప్రెషర్ లో లోపం పిఎస్‌ఎల్‌వి వైఫల్యానికి దారితీసిందని ఆయన వివరించారు. ఇప్పుడు తమ సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. ఎందుకు ఈ యాంత్రిక లోపం తలెత్తిందనేది ఆరా తీస్తోందని , త్వరలోనే అని విషయాలు తెలియచేయడం జరుగుతుందని వివరించారు. విఫల ప్రయోగానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
నమ్మిన బంటు ..ఇట్లా చేసిందెట్లా?
ఇస్రో పలు ప్రయోగాలకు పిఎస్‌ఎల్‌వి వాహకనౌక నమ్మినబంటుగా మారింది. అతి కొద్ది వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు తలెత్తింది మూడవ వైఫల్యం అని వెల్లడైంది. గతంలో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 1, తరువాతి అంగారక గ్రహ యాత్ర కూడా పిఎస్‌ఎల్‌వి ద్వారా విజయవంతం అయింది. అయితే 1993లో పిఎస్‌ఎల్‌వి ఆరంభ యాత్ర విఫలంగానే రికార్డుల్లో చేరింది. తరువాత 2017లో దీని ద్వారా ఓ నౌకాయాన శాటిలైట్ కక్షలోకి వెళ్లలేకపోయింది. ఈ రెండు వైఫల్యాల తరువాతి వైఫల్యం ఇప్పటి దశలో చోటుచేసుకుంది. పిఎస్‌ఎల్‌వి ద్వారా ఇప్పటివరకూ మొత్తం 63 ప్రయోగాలు నిర్వహించారు. విదేశాలకు చెందిన కీలక నానో శాటిలైట్లను కూడా పిఎస్‌ఎల్‌వి సి 61 ద్వారా ప్రయోగాలు జరిగాయి. ఇప్పటి కీలక ప్రయోగం వైఫల్యం వల్ల భూ పర్యవేక్షక ఉపగ్రహానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడిందా లేదా అనే విషయం స్పష్టం కాలేదు.
ప్రయోగం తరువాత లోపం తలెత్తితే సముద్రంలో కూలేది
ఇస్రో తలపెట్టిన ఈ ప్రయోగంలో సకాలంలో వైఫల్యం ఏర్పడింది. ప్రయోగం తరువాత సాంకేతిక యాంత్రిక లోపం తలెత్తి ఉంటే మరింత ఘోరంగా ఉండేది. పిఎస్‌ఎల్‌వి , ఎర్త్ శాటిలైట్‌తో పాటు సముద్రంలో కూలి ఉండేదని ఇస్రో రిటైర్డ్ అధికారి ఒక్కరు తెలిపారు. పిఎస్‌ఎల్‌వి రాకెటు దాదాపు 450 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత లోపాలు సంతరించుకుని ఉంటే అది ఇస్రో చరిత్రలో అత్యంత ఘోర వైఫల్యం అయి ఉండేది. ఇప్పుడు జరిగింది గుడ్డిలో మెల్ల తరహా అని ఈ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇటువంటి సాంకేతిక వైఫల్యాలు అప్పుడప్పుడు ఎదురవుతాయి. అయితే వీటిని గుణపాఠంగా భావించి ఇకపై లోపాలు తలెత్తకుండా చూసుకోవల్సి ఉందని ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఈ రాకెట్‌కు సంబంధించిన థర్డ్‌స్టేజ్ మోటారు రూపకల్పన దశలో చాలా క్లిష్టమైన ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. అయితే వీటిని అధిగమించామనితెలిపారు. ఇస్రోకు చెందిన అత్యంత నైపుణ్యపు సాంకేతిక బృందం పూర్తి సమన్వయంతో వ్యవహరించి , లోపాలకు కారణాలు తెలుసుకుని , ఇకపై జరగకుండా చేస్తారనే నమ్మకం ఉందని వివరించారు.