హైదరాబాద్: భూమి కోసం ఈ గడ్డపై పోరాటాలు జరిగాయని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని అన్నారు. నల్లమల డిక్లరేషన్ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..సంక్షేమం కోసం తెచ్చిన గొప్ప కార్యక్రమం ఇదని, అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలని చెప్పారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, భూములే కాదు వాటిని చదును చేసేందుకు నిధులు ఇస్తున్నామని తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రతి పైసా ప్రజలకే ఖర్చు చేస్తోందని, నిత్యం ప్రజల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలనే ఈ కార్యక్రమం తెచ్చామని, తమపై చేసే అనవసర విమర్శలను కుట్రలగానే చూస్తామని అన్నారు. సంపద సృష్టిస్తాం.. సృష్టించిన సంపద పేదలకు పంచుతాం..ఇదే తమ నినాదమని భట్టి చెప్పారు. రూ.వెయ్యి కోట్లతో రాజీవ్ యువ వికాసం ప్రారంభిస్తున్నామని, జూన్ 2 న రాజీవ్ యువ వికాసం పత్రాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు.