న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వివరించిన భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారించిన సుప్రీంకోర్టు.. “మీరు ఒక ప్రజా వ్యక్తి. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది సాయుధ దళాలకు ముఖ్యమైన విషయం. మనం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలంతా సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది” అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలను విచారించడానికి ఒక మహిళా అధికారితో సహా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మంత్రి విజయ్ షా అరెస్టును నిలిపివేయాలని.. కానీ ఆయన సిట్‌కు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 28వ తేదీ లోపు విచారణకు సంబంధించిన నివేదికను అందజేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.