అమరావతి: టిడిపికి బలం లేకున్నా ఉప ఎన్నికల్లో గెలిచినట్టు ప్రకటించుకుంటున్నారని వైసిపి అధినేత జగన్ (jagan) మోహన్ రెడ్డి తెలిపారు. నరసరావుపేట, కారంపూడిలో గెలిచామని ప్రకటించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ..కుప్పం మొదలు ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితని, రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదని మండిపడ్డారు. సిఎం స్థానంలో అక్రమాలను ప్రోత్సహించడం సమంజసమా?నని జగన్ ప్రశ్నించారు. పోలీసులను పెట్టి వైఎస్ఆర్ సిపి సభ్యులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యలమంచిలిలో తమ పార్టీ గట్టిగా నిలబడి గెలిచామని చెప్పారు. ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత రావాలంటే సమయం పడుతుందని, కూటమి ప్రభుత్వంపై నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత ఉందని తెలియజేశారు. తనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు హామి ఇచ్చారని, జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారని పేర్కొన్నారు.
కానీ వాటన్నింటినీ తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. ‘‘మన ప్రభుత్వంలో మేనిఫెస్టోతో గడప గడపకూ కార్యక్రమం కింద ప్రతి ఇంటికి వెళ్లాము. మనం చేసిన మంచి ఎక్కడికీ పోదు.’’ అని అన్నారు. 10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వాన్ని ఫుట్బాల్ లా తంతారని ధ్వజమెత్తారు. హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉందని, మాట ఇవ్వడమంటే వెన్ను పోటని బాబు నిరూపించారని విమర్శించారు. పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదని, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని చెప్పారు. రూ.3600 కోట్లు పెండింగ్ లో పెట్టారని, ఆరోగ్య ఆసరాలను పూర్తిగా ఎత్తివేశారని అన్నారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని జగన్ స్పష్టం చేశారు.