Wednesday, May 21, 2025

మళ్ళీ తెరమీదకు ‘మాయాబజార్’

- Advertisement -
- Advertisement -

ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం మాయా బజార్. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ’మాయాబజార్’ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి ‘మాయాబజార్‘ చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు . ‘మాయాబజార్‘ చిత్రాన్ని ఈనెల 28న మహానటుడు ఎన్. టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు. ‘మాయాబజార్’ సినిమాకు పింగళి నాగేంద్ర రావు అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే ఈ సినిమాను నవరస భరితంగా తెరమీద చూపించారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఈ చిత్రంలోని పాటలు ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.

శ్రీకృష్ణుడుగా ఎన్. టి. రామారావు, ఘటోత్కచుడు గా ఎస్. వి. రంగారావు, శశి రేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వర రావు ఆయా పాత్రలను సజీవంగా మన ముందు నిలబెట్టారు. ఈ చిత్రం 27 మార్చి 1957లో ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను కలర్ లో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల కోసం రామారావు బలుసు ఈనెల 28న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా టిడి జనార్దన్, రమేష్ ప్రసాద్, ఎస్‌వి కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, వీర శంకర్, భగీరథ, వైజె రాంబాబు, త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ “ మాయాబజార్ సినిమా అప్పటి ఇప్పటి తరానికి ఒక మైలు రాయి లాంటిది. ఇప్పుటితరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా ఆనాడే గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ ను మలిచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.

మళ్లీ ఇప్పుడు మాయాబజార్ ని బలుసు రామారావు విడుదల చెయ్యడం అభినందించదగ్గ విషయం”అని అన్నారు. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ “ఎన్టీఆర్ కుటుంబానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మా తండ్రి, రామారావు కలిసి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. వాళ్ళ సేవలు చిరస్మరణీయం. మాయాబజార్ చిత్రాన్ని ఐమ్యాక్స్ థియేటర్ లో పెద్ద స్క్రీన్ లో విడుదల చెయ్యడానికి బలుసు రామారావు అనుమతి కోరారు. వెంటనే ఆమోదించాము”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News