Wednesday, May 21, 2025

కెసిఆర్ హాజరవుతారా? లేదా?

- Advertisement -
- Advertisement -

గతంలో విద్యుత్ కమిషన్ ఎదుట హాజరు కాని
బిఆర్‌ఎస్ అధినేత ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కెసిఆర్,
హరీశ్‌రావు భేటీ స్వయంగా హాజరు కావడమా?
ప్రతినిధిని పంపడమా అనే అంశంపై విస్తృత చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసి ఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం విచారణలో భాగంగా కెసిఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్‌రావు,ఈటల రాజేందర్‌కు మంగళవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కెసిఆర్ విచారణకు రావాలని కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా హాజరవుతారా..? లేదా అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమిషన్ పలువురు అధికారులు, మాజీ అధికారులు, నిపుణులను విచారించింది. అయితే అందరూ కెసిఆర్ నిర్ణయాలనే తాము పాటించామని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణకు రావాలని విద్యుత్ కమిషన్ నోటీసులు ఇవ్వగా కెసిఆర్ హాజరుకాలేదు. తాను విచారణకు హాజరు కాలేనని మొదటి లేఖ రాసిన కెసిఆర్, తర్వాత కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో ఊరట లభించకపోవడంతో కెసిఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎల్.నర్సింహ్మారెడ్డి విచారణ దశలో ప్రెస్‌మీట్ పెట్టడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ జడ్జిని మార్చాలని సుప్రీంకోర్టు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమించింది. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కెసిఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ మదన్ భీ లోకూర్ కమిషన్ ఆ మేరకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే తాజాగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై కూడా కెసిఆర్ అదే రకంగా లేఖ రాసి సరిపెడతారా..? లేక వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

ఎర్రవల్లి నివాసంలో కెసిఆర్ -హరీశ్ రావు భేటీ
కాళేశ్వరం కమిషన్ బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఎర్రవెళ్లి నివాసంలో కెసిఆర్‌తో హరీష్‌రావు సమావేశమయ్యారు. పిసి ఘోష్ కమిషన్ నోటీసులపై ఇరువురు సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలా..లేక తమ ప్రతినిధి ద్వారా కమిషన్‌కు సమాధానం ఇవ్వాలా..? అనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News