ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఏవో అలజడులు చెలరేగుతూనే ఉన్నాయి. మానవ రుధిరం ఏరులై ప్రహహిస్తూనే ఉంది. మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో మారణకాండ విశృంఖల విహారం చేస్తూనే ఉంది. ఒక వైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇజ్రాయెల్, హమాస్ దాడులు గాజాను రక్తం సిక్తం చేసాయి. పాక్ ప్రేరణతో భారత్‌లో సీమాంతర ఉగ్రవాదం ప్రబలింది. ఇటీవల పహల్గాంలో అమాయకులను ఉగ్రవాదులు అత్యంత దారుణంగా కాల్చిచంపడంతో భారత్- పాక్‌ల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మనుషుల ప్రాణం తీసే మానసిక ఉన్మాదం పతాక స్థాయికి చేరింది. ఇతర దేశాలను నరమేథంతో దారికి తెచ్చుకోవాలనే పరాకాష్ఠకు చేరిన పైశాచిక అకృత్యాన్ని ‘ఉగ్రవాదం’ గా పేర్కొనవచ్చు.ఉగ్రవాదం ఆధునిక కాలంలో కొనసాగుతున్న అత్యంత క్రూరమైన ఆటవిక చర్య. ఉగ్రవాదం భారతదేశానికి ఒక విషమ సమస్యగా మారింది. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా భారతదేశం అనేక రూపాల్లో కొనసాగుతున్న ఉగ్రవాదం వలన నష్టపోతూనే ఉంది. దేశవిభజన సమయంలోనే అనేక విధాలుగా నష్టపోయాం.
ఇప్పుడు కూడా ఉగ్రవాదం రూపంలో పరాయి మూకలు దేశాన్ని కబళించాలని చూస్తున్నాయి. ఇతరుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను గుర్తించి గౌరవించిన దేశానికి నేటికీ కష్టాలు తప్పలేదు. బంగ్లా విమోచనకోసం పోరాడినా, లంకేయుల దేశసమగ్రత కోసం శ్రీలంకకు శాంతి సైన్యాన్ని పంపించి కాపాడినా భారత దేశానికి శత్రుబాధలు తప్పలేదు, చేదు ఫలితాలను చవిచూస్తున్నాం.పొరుగు దేశాల్లోని ఉగ్రవాదుల పంజాకు భారతదేశం మూల్యం చెల్లించుకోవడం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అదొక అనాగరిక, అమానుష ప్రక్రియగానే భావించాలి. అమాయ ప్రజల రుధిరంతో తడిసిన కర్కశమూకల వికృత ఆగడాలకు అడ్డాగా మారిన ఉగ్రవాద సంస్థలకు ఊతమిచ్చే ఏ దేశమైనా తమ పాపకృత్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రాయబారాలతో, ఒప్పందాలతో రాజీపడని మనస్తత్వాలకు దండోపాయమే శరణ్యమన్న సూత్రం ఇటీవల భారత్ జరిపిన ఆపరేషన్ సందూర్ నిరూపించింది. ఉగ్రవాద శిబిరాల ధ్వంసం ఉరిమురిమి చూసే ఉగ్రదేశమైన పాకిస్తాన్‌కు ముచ్చెమటలు పట్టించింది. భారత శాంతి వచనాలను పొరుగు దేశం అసమర్ధతగా భావించడం తెంపరితనం. అవసరార్ధ స్నేహాలను చూసుకుని పాక్ రెచ్చిపోతే భారత్ నుంచి ప్రతిఘటన అంతకు వెయ్యి రెట్లుంటుందనే వాస్తవాన్ని దాయాది దేశం గమనించాలి.
నాగరికత వెల్లివిరిసిన నేటి ప్రపంచంలో మనుషుల రక్తం తాగే ఉగ్రవాద మూకలు ఆటవిక మానవులకంటే వికృతంగా, క్రూరంగా ప్రవర్తించడం మానవత్వానికే మాయని మచ్చ. ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని అసహ్యించుకుంటున్నా ‘నవ్విపోదురు గాని నాకేటి సిగ్గు‘ అనే రీతిలో పాక్ బరితెగించింది. పాక్ ప్రభుత్వం, మిలిటరీ ఉగ్రవాదులకు అండగా నిలబడడం దౌర్భాగ్యం. ఉగ్రవాదుల పీడ వదిలించుకోలేని పాక్ ఆర్థికంగా పతనావస్థకు చేరింది. పాక్‌లో అంతర్గత సంక్షోభం విభజన దశకు చేరుకుంది. తన ఇంటిని చక్కదిద్దుకోలేని పాక్ భారత్‌ను నాశనం చేయాలను కోవడం దుర్మార్గమైన చర్య. వ్యక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఆర్ధిక మూలాలను ధ్వంసం చేయడమే కాకుండా అమాయక ప్రజల ప్రాణాలను అలవోకగా బలితీసుకుంటూ, నిరంతరం అశాంతిని ప్రజ్వలింపచేస్తూ ఆయా దేశాలను ఆక్రమించుకోవడమో, తమ కనుసన్నల్లో మసలుకునేటట్టు చేయడమో కొన్ని దేశాలకు నిత్యకృత్యంలా మారింది.
మానవత్వం నశించిన కరడుగట్టిన పైశాచిక వాదులను సమూహాలుగా ఏర్పాటు చేసి, ఇతర దేశాల్లో మారణహోమం సృష్టించడమే ధ్యేయంగా ఏర్పాటయిన విధ్యంసకారక సంస్థలే ఉగ్రవాద సంస్థలు. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో అశాంతిని సృష్టించే సామ్రాజ్యవాద శక్తులు ఒకవైపు, అకారణ కలహాలతో నిరంతరం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూ, ఏదో సాధించాలన్న తపనతో మానవత్వాన్ని మంటగలిపి, ఆ మంటల్లో చలికాచుకునే పైశాచికత్వం మరోవైపు ప్రపంచంలో ప్రబలిపోతుండడం విచారకరం. మానవత్వపు ఛాయలు విచ్ఛిన్నకారుల మనస్సుల్లో మచ్చుకైనా కానరావు. కరడుగట్టిన రాక్షసత్వమే నైజంగా బతికే ఉగ్రవాదులను విప్లవకారులుగా, సంస్కర్తలుగా కీర్తించే దేశాలను, ఉగ్రమూకలకు వత్తాసు పలుకుతూ, వారు సాగించే ఘోర హింసాకాండకు ఆర్ధికంగా, నైతికంగా సహకరించే దేశాల అనైతిక పోకడలను వర్ణింపతరం కాదు. మతమౌఢ్యవాదంతోనో, సామ్రాజ్యవాదంతోనో, స్వేచ్ఛ పేరుతోనో అమాయకుల కుత్తుకలను ఖండించే దుశ్చర్యలకు పాల్పడే కర్కశవాదం నుండి పుట్టిన ఉగ్రవాదాన్ని కూకటివ్రేళ్ళతో పెకలించాయి. చాలామంది ఉగ్రవాదులకు తాము సాగిస్తున్న మారణ కాండకు సంబంధించి సహేతుకమైన కారణం కనిపించదు. ఉగ్రవాదం కూడా కొంత మందికి ఉపాధినిచ్చే ముడిసరుకుగా మారడం అత్యంతహేయం, అమానవీయం. అశాంతిని సృష్టించడం వలన సాధించేదేమీ ఉండదన్న నగ్నసత్యం ఇప్పుటి వరకూ జరిగిన మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు నిరూపించాయి.
అమాయకుల ప్రాణాలు బలికావడం తప్ప ఉగ్రవాదుల దుశ్చర్యల వలన ఒనగూడే ప్రయోజనం శూన్యమని ప్రపంచంలో అనేక విధ్వంసాలు సృష్టించి తెరమరుగైన ఉగ్రవాద సంస్థల దృష్టాంతాలను గమనించాలి. భారత దేశం శాంతి కాముక దేశం. ఈ శాంతి వచనాల వల్ల ఇప్పటికే దేశం ఎంతో కోల్పోయింది. భవిష్యత్తులో మన దేశం ఇలాంటి శాంతి వచనాలు వల్లించడానికి సంసిద్ధంగా లేదు. వ్యూహానికి ప్రతివ్యూహం.. దెబ్బకుఎదురుదెబ్బ అన్నట్టుగా ముందుకు సాగితేనే శత్రుదేశాలు దారిలోకి వస్తాయి. చాలా కాలం నుండి మన దేశం అగ్రరాజ్యాల ఒత్తిడి వలనో, ఐక్యరాజ్య సమితి హితవచనాలు పాటించడం వలనో పొరుగు దేశాలు మన దేశాన్ని అనేక ఇబ్బందులకు గురిచేసాయి. ఎంతో మంది భారతీయ ముద్దుబిడ్డలు ఈ దేశ సమైక్యత కోసం బలి దానం గావించబడ్డారు. వారి రక్తతర్పణం వృథాగా పోలేదు. చనిపోయిన వీరుల త్యాగ ఫలం వలనే భారత దేశం సమైక్యంగా మనగలుగుతున్నది. భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిన మే 21 వ తేదీని ప్రతీ ఏటా ‘జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం’ గా పాటిస్తూ ఉగ్రవాదంపై అలుపెరుగని పోరు సాగిస్తున్నది.
సుంకవల్లి సత్తిరాజు