Thursday, May 22, 2025

ఉత్తరాది నీటి యుద్ధాలు ఆపండి

- Advertisement -
- Advertisement -

పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య దశాబ్దాల నాటి నీటి వాటాల వివాదం మళ్లీ భగ్గుమంటోంది. తమ వాటానుంచి ఒక్క నీటి చుక్కయినా పొరుగు రాష్ట్రం హర్యానాకు ఇచ్చేది లేదని పంజాబ్‌లోని ఆప్ నేతృత్వంలోని భగవంత్ మాన్‌సింగ్ ప్రభుత్వం భీష్మించుకుంది. ఈ మేరకు ఇటీవల అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. నీటి వాటా హక్కులను కాజేయడానికి బిజెపి కేంద్రం వత్తాసుతో భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు (బిబిఎంబి) ద్వారా తన హర్యానా ప్రభుత్వంతో ప్రయత్నిస్తోందని పంజాబ్ నీటి వనరుల మంత్రి బరీందర్ కుమాల్ గోయల్ ఆరోపించారు. గత మూడు సంవత్సరాలుగా పంజాబ్‌లోని అరవై శాతం పొలాలు భాక్రా కెనాల్ నుంచి సాగు నీటిని పొందుతున్నాయని, అందువల్ల అదనంగా ఏ రాష్ట్రానికీ నీటిని కేటాయించడానికి అవకాశం లేదని తీర్మానం పేర్కొంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ దీనిపై అఖిల పక్షసమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు దీనికి సంఘీభావం ప్రకటించాయి. అయితే బిజెపి నేతలు గతంలో హర్యానా అదనపు నీటిని పొందగలిగిందని, దీనివల్ల ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించవచ్చని వాదిస్తున్నారు. దీనికి సమాంతరంగా హర్యానా ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ నుంచి అదనంగా నీటిని పొందడానికి ఏకగ్రీవంగా తీర్మానించింది. అదనంగా నీటిని విడుదల చేయడానికి పంజాబ్ అంగీకరించిందని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ చెబుతున్నారు.

ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అభ్యర్థించారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు అదనపు నీటిని విడుదల చేస్తామని పంజాబ్ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించినప్పటికీ నిప్పుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. అయితే పంజాబ్ నీటిని విడుదల చేయబోమని పట్టుబట్టి కూర్చుంటే హర్యానాకు చెందిన ఎనిమిది జిల్లాలు తీవ్ర జలసంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. శిర్సా, హిసార్, ఫతేబాద్, జింద్, కిథల్, కురుక్షేత్ర, చర్ఖిదాద్రి, భివానీ జిల్లాలకు ప్రస్తుతం దాహార్తిని తీర్చడానికి తక్షణం 4931.90 కోట్ల లీటర్ల నీరు అవసరం కాగా, కేవలం 764.80 కోట్ల లీటర్ల నీరే అందుతోంది. భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు ( బిబిఎంబి) రిజర్వాయర్ల నుంచి ఎనిమిది రోజులపాటు రోజుకు 4500 క్యూసెక్కుల నీటిని హర్యానాకు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశించడంతో తాజాగా రెండు రాష్ట్రాల నీటి పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడింది. శనివారం నాడు బిబిఎంబి సమావేశాన్ని పంజాబ్ బహిష్కరించింది. బిబిఎంబి జారీ చేసిన నోటీసుకు అసమ్మతి తెలియజేసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ఈ విషయమై ఆలోచించేది లేదని కరాఖండీగా చెప్పింది. వార్షిక బిబిఎంబి నీటి కేటాయింపు సైకిల్ మే 21 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో ఈ వివాదం నెలకొనడం గమనార్హం. పంజాబ్ అభ్యంతరాన్ని తోసిరాజంటూ హర్యానాకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద మోహన్ వత్తాసు పలకడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఏప్రిల్ 30న ఉభయ రాష్ట్రాల అధికారులు బిబిఎంబి సమావేశానికి హాజరయ్యారు. 8500 క్యూసెక్కుల నీటిని హర్యానాకు విడుదల చేయాలని బిబిఎంబి ఆదేశించింది.

1910 నాటికే సంకల్పించిన భాక్రానంగల్ నదీ ప్రాజెక్టు స్వాతంత్య్రం వచ్చాక తొలినాళ్లలో రూపుదిద్దుకుంది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టును నిర్మింప చేశారు. సట్లజ్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టులో రెండు భాగాలున్నాయి. భాక్రా డ్యామ్ హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్మాణం కాగా, పది కిలోమీటర్ల దిగువ ప్రవాహంలో పంజాబ్‌లో నంగల్ డ్యామ్ నిర్మించారు. పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌గా రాష్ట్రం విడిపోక ముందు భాక్రా నంగల్ ప్రాజెక్టు పంజాబ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉండేది. అయితే మూడు రాష్ట్రాల ప్రయోజనాలను నెరవేర్చడానికి వీలుగా 1966 లో భాక్రా మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటైంది. మళ్లీ 1976లో భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డుగా పేరు మార్చుకుంది. అదనంగా మరికొన్ని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు ఈ బోర్డుకు అప్పగించబడ్డాయి. బియాస్ నదిపై బియాస్ సట్లజ్ లింక్ ప్రాజెక్టు (పాండో డ్యామ్), పాంగ్ డ్యామ్, ఈ రెండూ హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు బోర్డుకు దఖలు పడ్డాయి. ఇప్పుడు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు నీటి కేటాయింపులో భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డుదే కీలకమైన పాత్ర. అయినా పంజాబ్, హర్యానా నీటి వాటా విషయంలో బిజెపి ప్రభుత్వ పెత్తనం వివాదాలకు దారి తీస్తోంది.

పంజాబ్‌ను నచ్చచెప్పడానికి బదులు ఆదేశించడం వివాదం మరింత ముదురుతోంది. కేంద్రంలోని బిజెపి, హర్యానాలోని బిజెపి ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డును అడ్డం పెట్టుకుని పంజాబ్‌పై ఒత్తిడి తెస్తోంది. హర్యానా ఇప్పటికే తనకు కేటాయించిన 104% నీటిని వాడుకుందని, పంజాబ్ పేర్కొంది. అయితే అత్యంత అవసరమైన తాగునీటిని తమకు అందించకుండా పంజాబ్ అడ్డుకుంటోందని హర్యానా వాదిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి మారణకాండకు పాక్ ప్రమేయం ఉందని ప్రతీకారంగా పాకిస్తాన్‌తో సింధునదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడమే కాక, అన్ని విధాలా పాక్‌ను టార్గెట్ చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో అంతర్గతంగా నీటి వాటాల పంపకంలో వివాదాలు మరింత తీవ్రం కావడం మంచిది కాదు. అలాగే ఇందులో రాజకీయాలు ప్రేరేపించి రాష్ట్రాల మధ్య అగ్గిరాజేయడం క్షేమం కాదు. దేశంలో భాగస్వాములంతా చేతులు కలిపి తమ విభేదాలను పరిష్కరించుకోవలసిన బాధ్యత ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News