కన్నడ రచయిత్రి, సామాజికవేత్త , న్యాయవాది బాను ముస్తాక్ ఈ ఏటి 2025 ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెల్చుకున్నారు. హార్ట్ ల్యాంప్ ( హృదయ దీపం) అనే మె కథాసంకలనంలోని ఇతివృత్తానికి, రచనా నైపుణ్యానికి ఆమెకు ఈ అంతర్జాతీయ ప్రఖ్యాత సాహిత్య పురస్కారం దక్కింది. లండన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక సాహిత్య కళా పురస్కారాలను ప్రతి ఏటా ప్రకటిస్తారు. ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను ముస్తాక్ ఈ అవార్డు పొందిన తొలి కన్నడ సాహితివేత్త అయ్యారు. మంగళవారం ఆమె లండన్‌లోని టాటే మాడర్న్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకున్నారు. ఈ 12 కథల సంకలనం తర్జుమా కర్త దీప బాష్తి తో కలిపి ఆమె ఈ అవార్డు స్వీకరించారు. కన్నడం నుంచి ఈ కథల సంకలనం ఆంగ్లంలోకి అనువాదం అయింది. డజన్ చిన్న కథలలో పలు సామాజిక అంశాల ప్రస్తావన, నిశ్చిత స్థిర అభిప్రాయం, సగటు మహిళ ప్రతిఘటన, పదునైన భాషా పటిమ వంటివి ప్రతిఫలించాయి.
ఇవి ఆమె కథలను శక్తివంతం చేశాయని బుక్ ప్రైజర్ నిర్వాహకులు తెలిపారు. ఆమె బహుముఖ ప్రతిభావంతురాలు. ఓ దశలో జర్నలిస్టుగా తరువాతి క్రమంలో న్యాయవాదిగా పనిచేస్తూ వస్తున్నారు. హక్కుల కోసం తండ్రి స్ఫూర్తితో గళం ఎత్తారు. స్కూల్ విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె తొలి కథ ప్రచురితం అయింది. ఒక స్త్రీ ప్రతిభను , ఆమె భావ వ్యక్తీకరణను మతం, సమాజం ఏ విధంగా కట్టుబాట్లకు గురి చేస్తాయి. ఆమెను రెక్కలు తెగిన పక్షిని చేసి చతికిల పడేలా చేస్తాయనేది ఆమె ఈ కథల సంకలనంలో తెలిపారు. నిత్య జీవన సమరంలో ఎక్కడో ఓ చోట ఓ అక్కనో ఓ చెల్లినో , ఓ తల్లినో ఎదుర్కొనే సమస్యలు , సంక్లిష్టతలు ఆమె కథల నేపథ్యం అయ్యాయి. ఏ కథ కూడా చిన్నది కాదు, ఏ చిన్న జీవన ఘటన అయినా అదే సముద్రమంత అగాధం సంతరించుకుని ఉంటుంది. ఈ భావనతోనే ఈ చిన్న కథలను రాశానని ఈ రచయిత్రి తెలిపారు. ఈ ప్రపంచం బలహీనులను గుర్తించి సమయం చూసుకుని దెబ్బతీస్తుంది.
విభజిస్తుంది. అన్ని రంగాలు ఈ విధంగా పూర్తిగా కలుషితం అయ్యాయి. ఇక సాహిత్యం ఒక్కటే మనను ఇతరుల మస్తిష్కంలో మన ఆలోచనలు నింపేందుకు అనల్ప రీతిలో అయినా ఓ విధంగా చెప్పాలంటే అతి తక్కువ పేజీల క్రమంలో మిగిలి ఉన్న ఆసరా , మనం నడవగలిగే వసారా అని ఈ రచయిత్రి వ్యాఖ్యానించారు. ఆమె విజయం పట్ల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. కన్నడ ఘనతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని కొనియాడారు. పలువురు కన్నడ నేతలు, ఇతర రంగాల ప్రముఖులు ఆమెను అభినందించారు.