పాకిస్థాన్ లోని కల్లోలిత బెలూచిస్థాన్ కుజ్‌దార్ ప్రావిన్స్‌లో బుధవారం ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సులో పిల్లలను తీసుకెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి వెల్లడించారు. ఈ దాడిలో ఓ కారును ఆత్మాహుతి కోసం వాడినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించలేదు. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు దీని వెనుక ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారి ఆ ప్రదేశానికి వెళ్లారు. దర్యాప్తు కోసం అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను కంబైన్డ్ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టా, కరాచీ లోని ఆస్పత్రికి చేర్చారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకులైన పసివాళ్లు వారి ఉపాధ్యాయులు బలికావడంపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. భారత్ మద్దతు కలిగిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దోషులను పట్టుకుని చట్టానికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అధ్యక్షుడు అసిఫ్ అలి జర్దారీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. విదేశాంగ మంత్రి మొహిసిన్ నక్వీ పిల్లలపై దాడి చేసిన వారు మానవ మృగాలని తీవ్రంగా విమర్శించారు. ప్రావిన్సియల్ చీఫ్ మినిస్టర్ సర్ఫరాజ్ బుగ్టి ప్రావిన్స్ లోని ప్రతి ఉగ్రవాదిని పట్టుకుని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఖైబర్ ఫక్తుంఖ్వా చీఫ్ మినిస్టర్ అలి అమిన్ గండపూర్ ఈ దాడిని ఖండించారు.